"ఏం మామా, రాత్రి అలా బాటిల్ పగులగొట్టావు?" అని అడిగితే, "నేనా? నేను ఎప్పుడు మందు బాటిల్ పగలగొట్టాను?" అంటాడు ఓ స్నేహితుడు. "రాత్రి తాగి వచ్చి పచ్చి బూతులు తిట్టావా?" అని భార్య అంటే, "నేనా?" అంటాడు ఓ భర్త. "నడి రోడ్డు మీద అలా బట్టలు లేకుండా డ్యాన్స్ చేశావేంటి అల్లుడూ?" అంటే, "నేనా మామా?" అంటాడు ఓ అల్లుడు. ఇలా, తాగినవారు జరిగిందంతా ఎందుకు మర్చిపోతారు? దీని వెనుక ఓ కారణం ఉంది. ఆ కారణాలు ఏంటో ఈ కథనం పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది.

Continues below advertisement


మద్యం బాగా తీసుకుంటే జరిగినవి ఎందుకు మర్చిపోతారు?


మద్యం తాగిన తర్వాత రాత్రి జరిగిన విషయాలను మరిచిపోవడం తాగినవారందరికీ తెలిసిందే. అయితే, ఇలా మర్చిపోవడాన్ని సాధారణంగా "బ్లాక్‌అవుట్" (Blackout) అంటారు. ఇది ఎక్కువ మొత్తంలో మద్యం తక్కువ సమయంలో తీసుకోవడం వల్ల వస్తుంది. దీనికి ప్రధాన కారణం జ్ఞాపకశక్తి (Memory) లోపించడం.


ఇలా ఎందుకు జరుగుతుందంటే...


1. మెదడు పనితీరుకు ఆటంకం:


మన మెదడులో హిప్పోక్యాంపస్ (Hippocampus) అనే భాగం ఉంటుంది. దీని పని ఏంటంటే, ఇది కొత్త జ్ఞాపకాలను ఏర్పరుస్తుంది. అంతేకాదు, ఆ జ్ఞాపకాలను నిల్వ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఎక్కువ మోతాదులో లిక్కర్ తాగితే, దాని ప్రభావం హిప్పోక్యాంపస్ చేసే పనికి అడ్డు తగులుతుంది.


2. జ్ఞాపకాలను రికార్డు చేయకపోవడం (Memory Encoding Failure):


అధిక ఆల్కహాల్ ప్రభావం వల్ల, తాగుతున్న సమయంలో జరిగిన సంఘటనలు, మాటలకు సంబంధించిన సమాచారాన్ని మెదడు దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా (Long-Term Memories) మార్చకుండా సైలెంట్ అవుతుంది. అంటే, బాగా తాగినవారు జరిగిన విషయాలను మర్చిపోవడం కాదు; అసలు ఆ జ్ఞాపకాలనే రికార్డు చేయకపోవడం (Memory Encoding) జరుగుతుంది.



3. న్యూరోట్రాన్స్‌మిటర్ల (Neurotransmitters) లో మార్పులు:


ఆల్కహాల్, మెదడులోని నరాల కణాల మధ్య సంకేతాలను పంపే రసాయనాలు అయిన న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరును మారుస్తుంది. ముఖ్యంగా, జ్ఞాపకశక్తికి సంబంధించిన కొన్ని రిసెప్టర్లు (Receptors) అణచివేయబడతాయి లేదా నిరోధించబడతాయి.


మతిమరుపు (బ్లాక్‌అవుట్) కూడా రెండు రకాలు


లిక్కర్ అతిగా సేవిస్తే జరిగిన సంఘటనలు మర్చిపోవడాన్ని 'బ్లాక్‌అవుట్' అంటారని ఇంతకు ముందే తెలుసుకున్నాం. అయితే, ఈ బ్లాక్‌అవుట్ కూడా రెండు రకాలుగా ఉంటుంది:


1. ఫ్రాగ్మెంటరీ బ్లాక్‌అవుట్ (Fragmentary Blackout) / బ్రౌన్‌అవుట్ (Brownout):


ఈ స్థితిలో కొన్ని విషయాలు అస్పష్టంగా, కొద్దికొద్దిగా గుర్తుంటాయి. కానీ, అన్ని వివరాలు పూర్తిగా గుర్తుకు రావు, జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పలేకపోవడం జరుగుతుంది. ఇతరులు ఆ సంఘటనలను గుర్తు చేసినప్పుడు లేదా ఆ సంఘటనకు సంబంధించిన ఏదైనా వస్తువును చూసినప్పుడు కొన్ని జ్ఞాపకాలు తిరిగి రావచ్చు. దీన్ని ఫ్రాగ్మెంటరీ బ్లాక్‌అవుట్ అంటారు.


2. ఎన్-బ్లాక్ బ్లాక్‌అవుట్ (En Bloc Blackout):


ఇందులో, బాగా తాగిన సమయంలో జరిగిన సంఘటన కొద్ది సమయం తర్వాత ఏం జరిగిందో పూర్తిగా గుర్తులేకపోవడం జరుగుతుంది. ఇలా జరిగితే, ఆ సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన జ్ఞాపకాలను తిరిగి పొందలేరు. ఏం చెప్పినా, ఎంత గుర్తు చేసినా జరిగిన సంఘటనలు ఆ వ్యక్తికి గుర్తు రావు. దీన్నే ఎన్-బ్లాక్ బ్లాక్‌అవుట్ అంటారు.


అయితే, ఇలా అధిక మొత్తంలో తాగడం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోవడం ఆ వ్యక్తిపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యం అధికంగా తాగితే ఆ ప్రభావం కేవలం మెదడు మీదే కాకుండా, శరీరంలోని అన్ని భాగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అతిగా మద్యం సేవించారనడానికి, ఇలా జరిగిన విషయాలను మర్చిపోవడం ఒక సూచికగా చెప్పవచ్చు.