International Tiger Day 2025 : అంతర్జాతీయ పులుల దినోత్సవంను ప్రతి ఏడాది జూలై 29వ తేదీన జరుపుకుంటారు. అయితే ఈసారి ఈ టైగర్స్ డే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రత్యేకతను ఇచ్చింది. అంతరించిపోతున్న పులుల సంరక్షణను ప్రోత్సాహించేందుకు జరిపే ఈ స్పెషల్ డే ఎందుకు మధ్యప్రదేశా రాష్ట్రానికి ప్రత్యేకమో తెలుసా? పులుల మనుగడ, సంరక్షణ కోసం ఆ రాష్ట్రంలో చేపట్టిన చర్యల ఫలితంగా.. నేడు అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్న ప్రదేశంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఇది కేవలం మధ్యప్రదేశ్‌కే కాదు భారతదేశానికి కూడా గర్వకారణం.
పులుల గణనలో భాగంగా 2022లో భారతదేశంలో దాదాపు 3,682 పులులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అత్యధికంగా 785 పులులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తీసుకున్న చొరవ ఫలితంగా పులుల సంఖ్యను పెంచేవిధంగా నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పులులు నివసించే ప్రాంతాలలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పులుల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. మధ్యప్రదేశ్ కారిడార్లు.. ఉత్తర, దక్షిణ భారతదేశంలోని పులుల రిజర్వ్‌లతో అనుసంధనమై ఉంటాయి.
పులులు పెరగడానికి కారణం అదే..
మధ్యప్రదేశ్‌లో పులుల సంఖ్యను పెంచడంలో జాతీయ ఉద్యానవనాల మెరుగైన నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అడవులకు సమీపంలో ఉన్న గ్రామాలను తరలించడం ద్వారా పెద్ద భూభాగాన్ని.. జీవసంబంధమైన ఒత్తిడి నుంచి విముక్తి ఇ,స్తుంది. రక్షిత ప్రాంతాలకు గ్రామాలను తరలించడం వల్ల వన్యప్రాణుల నివాస ప్రాంతం విస్తీరమవుతుంది. కాన్హా, పెంచ్, కునో పాల్‌పూర్ ప్రధాన ప్రాంతాల నుంచి అన్ని గ్రామాలను తరలించారు. సత్పురా టైగర్ రిజర్వ్ 90 శాతం కంటే ఎక్కువ ప్రధాన ప్రాంతం కూడా.. జీవసంబంధమైన ఒత్తిడి నుంచి దూరంగానే ఉంది.
గడ్డి మైదానాలు
నిపుణుల సహాయంతో స్థానిక జాతుల గడ్డి మైదానాలు అభివృద్ధి చేశారు. దీనివల్ల శాకాహార వన్యప్రాణులకు ఏడాది పొడవునా ఆహారం అందుబాటులో దొరికింది. రక్షిత ప్రాంతాలలో నివాస అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. గత సంవత్సరాలలో ఎక్కువ చిరుతపులులు ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ సంఖ్యలో చిరుతపులులు ఉన్న ప్రాంతాలకు విజయవంతంగా తరలించారు. ఈ చొరవతో చిరుతపులుల సంఖ్య పెరిగింది. అలా మొత్తం భూభాగంలో చిరుతపులుల ఉనికి మునుపటికంటే ఎక్కువైంది.
అగ్రస్థానంలో MP
మధ్యప్రదేశ్ టైగర్ రాష్ట్ర హోదాను పెంచడంతో పాటు జాతీయ ఉద్యానవనాలు, రక్షిత ప్రాంతాల సమర్థవంతమైన నిర్వహణలో దేశంలోనే అగ్రస్థానాన్ని పొందింది. సత్పురా టైగర్ రిజర్వ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చవచ్చు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన టైగర్ రిజర్వ్ నిర్వహణ ప్రభావశీలత మూల్యాంకన నివేదిక ప్రకారం.. పెంచ్ టైగర్ రిజర్వ్ దేశంలోనే అత్యున్నత ర్యాంక్ సాధించింది. బాంధవ్‌గఢ్, కాన్హా, సంజయ్, సత్పురా టైగర్ రిజర్వ్‌లను ఉత్తమ నిర్వహణ కలిగిన రిజర్వ్‌లుగా పరిగణించారు. ఈ జాతీయ ఉద్యానవనాలలో ప్రత్యేకమైన నిర్వహణ పథకాలు, వినూత్న పద్ధతులు అవలంబించారు.
పులుల సంరక్షణకు చొరవ
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పులుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిలో వన్యప్రాణి అభయారణ్యాల సంరక్షణ, నిర్వహణ, పులులను పర్యవేక్షించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు హెల్ప్ చేస్తుంది. మధ్యప్రదేశ్‌లో 9 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి. ఈ రిజర్వ్ మధ్యప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధ టైగర్ రిజర్వ్.
పెరిగిన విదేశీ పర్యాటకులు
టైగర్ రిజర్వ్‌లలో దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్‌లలో 2024-25 సంవత్సరంలో 32 వేల 528 మంది.. కాన్హా టైగర్ రిజర్వ్‌లో 23 వేల 59 మంది.. పన్నా టైగర్ రిజర్వ్‌లో 15 వేల 201 మంది, పెంచ్ టైగర్ రిజర్వ్‌లో 13 వేల 127, సత్పురా టైగర్ రిజర్వ్‌లో 10 వేల 38 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు.
అదేవిధంగా, 2023-24 సంవత్సరంలో బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో 25 వేల 894 మంది, కాన్హా టైగర్ రిజర్వ్‌లో 18 వేల 179 మంది, పన్నా టైగర్ రిజర్వ్‌లో 12 వేల 538 మంది, పెంచ్ టైగర్ రిజర్వ్‌లో 9 వేల 856 మంది, సత్పురా టైగర్ రిజర్వ్‌లో 6 వేల 876 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు.
టైగర్ రిజర్వ్‌ల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది?
మధ్యప్రదేశ్ టైగర్ రిజర్వ్‌లలో 5 సంవత్సరాలలో భారతీయ పర్యాటకుల సంఖ్య 7 లక్షల 38 వేల 637 కాగా, విదేశీ పర్యాటకుల సంఖ్య 85 వేల 742. ఈ విధంగా మొత్తం 8 లక్షల 24 వేల 379 మంది పర్యాటకులు సందర్శించారు. అంటే 5 సంవత్సరాలలో టైగర్ రిజర్వ్‌ల ద్వారా దాదాపు 61 కోట్ల 22 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది.
భారతీయ వన్యప్రాణి సంస్థ డెహ్రాడూన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పులులు హ్యాపీగా నివసించేందుకు మధ్యప్రదేశ్‌లోని కాన్హా టైగర్ రిజర్వ్ అనువైందని తెలిపింది. పులుల సంరక్షణలో మానవ జోక్యం తగ్గించారు. వన్యప్రాణులకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లభించింది. కాన్హా టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణులను పర్యవేక్షించడానికి M-STriPES మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.