ఏకాంతం కోసం ప్రేమికులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కాసేపు కలిసి ప్రేమగా మాట్లాడుకోవాలంటే.. ప్రైవసీయే దొరకదు. దీంతో చాలామంది పార్కుల్లో, స్నేహితుల రూమ్‌లో కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ, ఎవరో వచ్చేస్తారని, చూసేస్తారనే భయం వారిని వెంటాడుతుంది. అయితే, ఆ దేశంలో మాత్రం అలాంటి సమస్య ఉండదు. ‘‘ప్రేమికులూ.. మీకు ఎందుకు అన్ని పాట్లు? మా హోటల్‌కు వచ్చి మాట్లాడుకోండి’’ అని ‘లవ్ మోటల్స్’ పిలుస్తున్నాయి. వారి కోసం గంట చొప్పున గదులను అద్దెకు ఇస్తున్నాయి. ఆ గంటసేపు వారిని అస్సలు డిస్ట్రబ్ చేయరు. ఇంతకీ ఎక్కడా అని అనుకుంటున్నారా?
దక్షిణ కొరియా(South Korea)లో లవ్ మోటల్స్ పేరుతో అనేక హోటళ్లు నడుస్తున్నాయి. ప్రేమికులు ఎప్పుడు పడితే అప్పుడు ఆ హోటళ్లలో బస చేయొచ్చు. అయితే, అవి కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు. కొరియా వెళ్లే అతిథులు కూడా కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్లిపోవచ్చు. ఈ లవ్ హోటల్స్ ఏర్పాటుకు పెద్ద కారణమే ఉంది. సాధారణంగా అమెరికా, యూకే, జపాన్ వంటి దేశాల్లో రొమాంటిక్ లైఫ్‌ను యువత ఎంజాయ్ చేస్తారు. ఒకే ఇంట్లో సహజీవనం కూడా చేస్తారు. తమకు నచ్చిన పార్టనర్‌ను ఇంటికి తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా స్వే్చ్ఛగా తిరుగుతారు. కానీ, దక్షిణ కొరియాలో అలా చేయడం కుదరదు. ఇందుకు కారణం.. కొరియన్ ప్రాచీన సాంప్రదాయాలు.
కన్ఫ్యూషియనిజం(ప్రాచీన ఆచారాలు), చోసున్ రాజవంశం నుంచి వచ్చిన సాంప్రదాయాల ప్రకారం.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు పెట్టుకోవడాన్ని పెద్దలు తప్పుగా భావిస్తారు. అయితే, కొరియన్ యువత మాత్రం.. ప్రేమ, లైంగిక స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఇందుకు కొరియన్ సమాజం ఏ మాత్రం అంగీకరించదు. సెక్స్‌ను అక్కడ అపరాధంగా భావిస్తారు. దీంతో కొరియాలో కొందరు ప్రేమికులు స్వేచ్ఛగా బయట తిరగాలంటే సిగ్గు పడతారు. మరికొందరు భయపడతారు. వారు కలిసి మాట్లాడుకొనేందుకు తగిన స్థలాలు కూడా ఉండవు. పైగా కొరియాలో చాలామంది చిన్న ఇళ్లల్లో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటారు. వేరేగా ఉండటానికి అక్కడి పెద్దలు అంగీకరించరు. అందుకే, వారు తమ మనసుకు నచ్చిన వ్యక్తితో ఏకాంతంగా గడిపేందుకు ఈ లవ్ మోటెల్స్ ఏర్పాటు చేశారు.
ఈ ప్రేమ గదులను అక్కడ ఎక్కువగా మోటల్స్ లేదా మోటెల్స్ అని మాత్రమే పిలుస్తారు. ఎందుకంటే.. వీటికి హోటళ్ల తరహాలో పెద్ద పెద్ద కారిడార్లు ఉండవు. లోపలికి వెళ్లగానే రిసెప్షన్, గదులు మాత్రమే ఉంటాయి. అంటే మన లాడ్జీల తరహాలో ఉంటాయి. ఇటీవల అక్కడి చట్టాలు ఈ మోటల్స్‌ను హోటల్స్‌గా మార్చాలని పేర్కొన్నాయి. లవ్ మోటల్స్‌లో చెక్ ఇన్, చెక్ అవుట్ టైమింగ్స్ కూడా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ కేవలం గంటకు మాత్రమే అద్దెకు ఇస్తారు. మరో గంట ఉండాలంటే అదనంగా చెల్లించాలి. సాధారణ హోటళ్లతో పోల్చితే.. ఈ లవ్ మోటల్స్ గదుల ధరలే ఎక్కువ. పైగా.. వీటిని చాలా అందంగా, అట్రాక్టీవ్‌గా అలంకరిస్తారు. దీంతో యువత కూడా ఈ మోటల్స్‌లో ఉండేందుకు ఇష్టపడతారు.
ఇండియాలో కూడా జంటలు కలిసి ఉండటాన్ని అపరాధంగానే భావిస్తారు. ముఖ్యంగా హోటల్ గదిలో పెళ్లికాని జంటలు కలిసి ఉండటం నేరమని భావిస్తారు. వాస్తవానికి పెళ్లి కాని జంటలు హోటళ్లలో ఉండకూడదని చెప్పేందుకు ఎలాంటి చట్టం లేదు. అయితే, వారి వయస్సు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. తగిన గుర్తింపు కార్డులు కూడా ఉండాలి. కానీ, మన దేశంలో కొన్ని హోటళ్లు, గెస్టు హౌస్‌లు వారికి రూమ్ ఇవ్వడానికి సందేహిస్తాయి. అది హోటళ్లు నిర్వాహకులు విధించుకున్న సొంత నియమం మాత్రమే. ఎందుకంటే.. చట్టంలోని లొసుగులను క్యాష్ చేసుకోడానికి కొందరు వాటిని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తారు.