Dosa Recipe with Oats : ఓట్స్‌తో మీరు రోటీన్ ఫుడ్ కాకుండా టేస్టీగా, క్రిస్పీగా దోశలు తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం కూడా. ఓట్స్, ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో మీరు టేస్టీ దోశలు రెడీ చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాంట్ దోశల కోసం ఉదయం కాకుండా రాత్రి కూడా ఓట్స్‌తో ఈ బ్యాటర్ తయారు చేసుకోవచ్చు. కానీ వాటిలో ఉల్లిపాయలు అవాయిడ్ చేయాలి. ఉదయాన్నే పిండిలో కాస్త నీరు కలిపి దోశలు పోసుకోవాలి. ఇంతకీ ఓట్స్‌తో క్రిస్పీ, టేస్టీ దోశలు ఎలా తయారు చేయాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఓట్స్ - అర కప్పు
బియ్యం పిండి - పావు కప్పు
రవ్వ - పావు కప్పు
పెరుగు - అరకప్పు
ఉల్లిపాయ - 1
అల్లం - అంగుళం
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - 1 కట్ట
కరివేపాకు - 1 రెబ్బ
జీలకర్ర - అర టీస్పూన్
కారం - పావు టీస్పూన్
కొబ్బరి తురుము - 2 టీస్పూన్లు (ఆప్షనల్)
నీరు - తగినంత
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీరను బాగా కడిగి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓట్స్‌ను మిక్సీలోకి తీసుకుని మెత్తగా పిండి చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని మిక్సింగ్ గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో బియ్యం పిండి, రవ్వ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. మీరు దీనిలో కాస్త పులిసిన పెరుగు తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు దానిలో తగినంత నీరు వేసి దోశ బ్యాటర్‌లాగా సిద్ధం చేసుకోవాలి. మీరు నీటికి బదులు పెరుగును కూడా ఉపయోగించవచ్చు.
పిండిని ముద్దలు లేకుండా బాగా మృదువుగా అయ్యేలా కలపాలి. ఇప్పుడు దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. జీలకర్ర, కారం, ఉప్పు, తురిమిన తాజా కొబ్బరి వేసి ఈ బ్యాటర్‌ను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి. పది నిమిషాల తర్వాత పిండిని తీసి నీటిని అడ్జెస్ట్ చేయండి. ఎందుకంటే ఓట్స్ పిండి నీటిని పీల్చుకుంటుంది కాబట్టి. పిండి దోశ బ్యాటర్లా ఉంటే దోశలు మంచిగా వస్తాయి.
స్టౌవ్ వెలిగించి దానిపై నాన్ స్టిక్ దోశ పాన్ పెట్టండి. దానికి నూనె అప్లై చేసి.. పిండిని బాగా అప్లై చేసి.. దోశలు పోసుకోండి. పిండిని ఒకేసారి వేసేయకుండా కొద్దిగా కొద్దిగా.. ఖాళీలు ఉండేలు వేయండి. ఇలా చేస్తే దోశ మరింత క్రిస్పీగా వస్తుంది. దోశ వేసిన తర్వాత నూనెను వేసి రోస్ట్ చేయండి. ఒకవైపు బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత మరోవైపు తిప్పండి. ఇలా ఉడికించిన దానిని ప్లేట్లోకి తీసుకుండి. మిగిలిన బ్యాటర్‌తో కూడా ఇలానే చేయండి. అంతే వేడి వేడి టేస్టీ, క్రిస్పీ ఓట్స్ దోశలు రెడీ. వీటిని మీరు నచ్చిన చట్నీతో లాగించేయవచ్చు. ముఖ్యంగా పల్లీలతో చేసిన చట్నీ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇవి వేడి తగ్గిన తర్వాత తిన్నా కూడా మంచి రుచినే అందిస్తాయి.
Also Read : టేస్టీ రవ్వ ఇడ్లీలు.. వీటి తయారీకి మినపప్పు అవసరమే లేదు