Important Things Couples Must Discuss : పెళ్లి అనేది జీవితంలో అతి పెద్ద, ముఖ్యమైన నిర్ణయం. ఇది కేవలం ఇద్దరి మధ్య బంధాన్ని మాత్రమే కాదు.. రెండు ఆలోచనలు, రెండు కుటుంబాలు, రెండు వేర్వేరు జీవితాలు ఒకటిగా చేస్తుంది. అయితే పెళ్లి సన్నాహాలలో పడి ఎంత బిజీ అవుతారంటే.. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి.. అసలైన సంబంధం గురించి పెద్దగా పట్టించుకోరు. అందమైన దుస్తులు, పెద్ద పార్టీలు, ఆచారాలు వంటివాటిలో పడి చాలా ముఖ్యమైన విషయాలు గురించి డిస్కషన్ చేయరు. దీనివల్ల ఫ్యూచర్​లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

Continues below advertisement

కొన్నిసార్లు పెళ్లైన కొద్దికాలానికే.. ఈ విషయాలను ముందే అడిగి తెలుసుకుని పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదనే ఫీల్ రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధంలో ఒత్తిడి, అపార్థాలు, గొడవలు పెరగడం మొదలవుతాయి. అందుకే ప్రేమ వివాహం అయినా లేదా పెద్దలు కుదిర్చిన వివాహం అయినా.. పెళ్లికి ముందు ఒకరితో ఒకరు డైరక్ట్​గా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికలు, కుటుంబ అంచనాలు, కెరీర్, పిల్లలు, జీవనశైలి వంటి విషయాలు ముందుగానే మాట్లాడుకుంటే.. పెళ్లి తర్వాత ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

జీవిత లక్ష్యాలు

పెళ్లికి ముందు మీ జీవితంలో మీరు ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కెరీర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారా? పిల్లల విషయంలో ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయా? భవిష్యత్తులో ఎక్కడ నివసించాలనుకుంటున్నారు? మీ నగరంలోనా లేక మరేదైనా ప్రదేశంలో ఉండాలనుకుంటున్నారా? అనేవి అడగాలి. మీ, మీ భాగస్వామి కలలు, లక్ష్యాలు చాలా భిన్నంగా ఉంటే.. భవిష్యత్తులో రాజీ పడటం కష్టమవుతుంది. 

Continues below advertisement

అభిప్రాయాలు గౌరవించుకోవడం

మంచి సంబంధం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరి భావాలను, ఆలోచనలను, నిర్ణయాలను గౌరవించుకోవడం. పెళ్లికి ముందే ఒకరి మాటలను పట్టించుకోకపోతే లేదా వారి స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తితే.. అది ఒక హెచ్చరిక కావచ్చు. 

జీతం, ఖర్చులు

ఈ రోజుల్లో చాలా మంది జంటలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ, మీ భాగస్వామి ఆదాయం ఎంత? నెలవారీ ఖర్చులు ఎంత? పొదుపు అలవాట్లు ఎలా ఉన్నాయి? జీతం ఎక్కువగా చెప్పడం లేదా ఖర్చులను దాచడం సంబంధం ప్రారంభంలోనే నమ్మకాన్ని బలహీనపరుస్తుంది. 

రుణాలు, అప్పులు

మీకు ఏదైనా విద్యా రుణం, వ్యక్తిగత రుణం లేదా గృహ రుణం కలిగి ఉంటే.. పెళ్లికి ముందు దాని గురించి చేసుకోబోయే వారికి స్పష్టంగా చెప్పాలి. EMI చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ప్రతి నెలా దాన్ని తీర్చడం అంత సులభం కాదు. కుటుంబంపై కూడా ఏదైనా పెద్ద రుణం ఉందా అని తెలుసుకోవడం ముఖ్యం. పెళ్లి తర్వాత కొత్త ఆర్థిక బాధ్యతలను ఎలా నిర్వహించాలో తెలుస్తుంది. 

లావాదేవీలు, ఆర్థిక సహాయం గురించి

పెళ్లి తర్వాత తరచుగా బంధువులకు లేదా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయాల్సి రావచ్చు. అలాంటి సహాయం చేయాలా వద్దా? చేయాల్సి వస్తే ఎంతవరకు చేయాలి? అనే దానిపై ముందుగా నిర్ణయం తీసుకోవాలి. అది తర్వాత గొడవలకు కారణం కావచ్చు. 

వ్యక్తిగత పొదుపులు

పార్టనర్​పై నమ్మకం ముఖ్యం. కానీ ప్రతి విషయాన్ని వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత పొదుపులు, భవిష్యత్ ప్రణాళికలు మీ సొంతం కావచ్చు. సంబంధం బలపడే కొద్దీ.. ఈ విషయాలపై చర్చించవచ్చు. వ్యక్తిగత పొదుపులపై ప్రతి వ్యక్తికి హక్కు ఉంటుందని.. ప్రతి పైసా లెక్క చెప్పాల్సిన అవసరం లేదని ఇద్దరూ అర్థం చేసుకోవడం ముఖ్యం. 

ఆరోగ్యం సమాచారం

ఎవరికైనా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి లేదా ప్రత్యేక ఆరోగ్య అవసరం ఉంటే.. దానిని దాచడానికి బదులుగా ముందుగానే చెప్పడం మంచిది.

జీవనశైలి

ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ట్రావెల్ చేయడం ఇష్టమేనా? సోషల్ లైఫ్, రొటీన్ ఎలా ఉంటుందో ముందే మాట్లాడుకుంటే మంచిది.

ఈ విషయాలలో చాలా తేడా ఉంటే.. భవిష్యత్తులో సర్దుబాటు చేసుకోవడం కష్టమవుతుంది. అంతేకాకుండా ముందుగానే మాట్లాడుకోవడం వల్ల ఒకరిపట్ల ఒకరికి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఈ విషయాల్లో ఏదైనా తప్పు చెప్తే మాత్రం ఫ్యూచర్​లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.