(Source: Poll of Polls)
Diabetes : మీ అమ్మ, నాన్నకు మధుమేహం ఉంటే.. డయాబెటిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Genetic Risk of Diabetes : డయాబెటిస్ జన్యుపరమైన ప్రమాదం కాబట్టి తల్లిదండ్రులకు మీరు జాగ్రత్త పడాలి. అసలు మధుమేహం రాకుండా ఉండేందుకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Type 2 Diabetes : మీ ఇంట్లో మధుమేహం తరతరాలుగా వారసత్వంగా వస్తోందా? మీ తల్లిదండ్రులిద్దరికీ టైప్ 2 మధుమేహం ఉందా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇది యాదృచ్చికం కాదు. ఆరోగ్యసమస్యకు ప్రధాన హెచ్చరిక కావచ్చు. ఎందుకంటే జన్యుపరంగా మీకు కూడా మధుమేహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మీరు డయాబెటిస్ రాకూడదు అనుకుంటే.. మీ జీవనశైలిలో, ఆహారంలో పలు మార్పులు చేయడంతో పాటు ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేయాలి. లేకపోతే ఈ వ్యాధి మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. అసలు ఇలా పేరెంట్స్‌కి మధుమేహం ఉంటే.. పిల్లలకు ఎందుకు వస్తుందో? దానిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
50 శాతం ప్రమాదం ఎక్కువ
హైదరాబాద్‌లోని గ్లెనెగల్స్ హాస్పిటల్‌కు చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఎస్.హిరణ్ రెడ్డి ఈ సమస్య గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ''ఇలాంటి కేసులలో ఒక వ్యక్తికి ఇన్సులిన్ నిరోధకత లేదా బీటా-కణాల లోపం వారసత్వంగా రావచ్చు. దీనివల్ల శరీరం రక్తంలో చక్కెరను సరిగ్గా నియంత్రించలేకపోవచ్చు. తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే.. మీ జీవితంలో ఎప్పుడైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం 50% కంటే ఎక్కువగా ఉంటుంది'' అని తెలిపారు.
యూత్‌లో ఉన్నప్పుడు దీని లక్షణాలు కనిపించకపోవచ్చు.. కానీ కాలక్రమేణా ఫాస్టింగ్‌లో బ్లడ్ షుగర్ స్థాయిలు పెరగడం లేదా గ్లూకోజ్ రెసిస్టెన్సీ తగ్గడం జరుగుతాయి. దీనర్థం మీ తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే.. మీకు కూడా వస్తుందని కాదు. కానీ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయడం సరైనది కాదని అర్థం. వంశపారంపర్యంగా ఉండే వ్యాధులు మీకు కూడా వచ్చే అవకాశముందని.. కానీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించవచ్చని హిరణ్ రెడ్డి తెలిపారు.
రెగ్యులర్ చెకప్స్..
మీ తల్లిదండ్రులకు డయాబెటిస్ ఉండి.. మీ వయస్సు 25 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే లేదా మీరు ఊబకాయం, అలసట లేదా సోమరితనంతో ఇబ్బంది పడుతుంటే.. సంవత్సరానికి ఒకసారైనా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది ప్రారంభ సంకేతాలను సూచిస్తుంది కాబట్టి.. మధుమేహంగా మారకుండా ఆపడానికి వీలు ఉంటుంది.
ఇలా దూరం చేసుకోవచ్చు
టైప్ 2 మధుమేహం నుంచి రక్షించుకోవడం పూర్తిగా సాధ్యమే. డాక్టర్ హిరణ్ అభిప్రాయం ప్రకారం.. ''మీరు మీ బరువును నియంత్రణలో ఉంచుకుంటే, మధుమేహం ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అంతేకాకుండా మీ ఆహారం సమతుల్యంగా ఉండాలి. కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, గుడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే నట్స్, ఆలివ్ నూనెను ఎంచుకోండి. అలాగే తీపి, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం అవసరం'' అని తెలిపారు.
కాబట్టి మీ పేరెంట్స్‌కి డయాబెటిస్ ఉంటే.. కంగారు పడకుండా ముందుగా చెకప్స్ చేయించుకోండి. మధుమేహ ప్రమాదం ఉన్నా లేకున్నా.. మీరు వైద్యులు సూచించిన టిప్స్ ఫాలో అయితే ఎప్పటికీ మధుమేహ ఇబ్బంది రాదు.






















