వేసవి వచ్చేసింది. వేసవి అనగానే చల్లని పానీయాలు, ఐస్ క్రీములు ఎంజాయ్ చేసే కాలం. వీలైనంత చల్లగా ఉండాలని కోరుకుంటాం. వేసవి కాలంలో హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం కూడా. వాతావరణం వేడిగా ఉండడం వల్ల శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతుంటుంది. అందువల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ కు కారణం కావచ్చు. చల్లని పానీయాలు తాగడం కోసం తపిస్తుంటారు. కానీ చక్కెరలు అధికంగా ఉండే కార్బోనేటెడ్ డ్రింక్స్ అస్సలు మంచిది కాదు. ఇవి శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి. అప్పటికి ఒక రిఫ్రెషింగ్ ఫీల్ ను ఇచ్చినప్పటికీ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి.
డీహైడ్రేషన్, వేడి వల్ల అలసట, హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వంటి రకరకాల అనారోగ్యాలు వేసవిలో ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో బీపీ పడిపోవడం, గుండెదడ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బెంగ పడే పనిలేదు ప్రముఖ డైటీషన్ లోవ్నీత్ బాత్రా కొన్ని వేసవి పానీయాల గురించి తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ పానీయాలు అదనపు క్యాలరీలను జోడించకుండానే రిఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయని చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
సత్తు నీళ్లు
సత్తులో ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సోడియం తక్కువ. త్వరగా శరీరానికి శక్తిని అందిస్తుంది. అంతేకాదు ఇదొక కూలింగ్ ఏజెంట్. నీటిలో కరగని ఫైబర్ ఇందులో పుష్కలం. ఇది పేగుల ఆరోగ్యానికి మంచిది. గ్యాస్, మలబద్దకం, అసిడిటికి మంచి మందుగా చెప్పవచ్చు. ఇదొక సూపర్ కూలింగ్ డ్రింక్. వేయించిన శనగపిండితో చేసే సత్తునీళ్ల పానీయం ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నిషియంతో పుష్టికరమైన పానీయం. జీర్ణ వ్యవస్థ పీహెచ్ బ్యాలెన్స్ కూడా చేస్తుంది.
వెలగ పండు రసం
వెలగ పండుతో చేసిన జ్యూస్ వేసవిలో మంచి ఎనర్జీ బూస్టర్. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనిలో రైబోఫ్లేవిన్, బి- విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఆంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి, ఐరన్, పోటాషియం వంటి పోషకాలు కూడా ఎక్కువే. రోగనిరోధక శక్తి పెంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
మజ్జిగ
ఉప్పు, కొద్దిగా మసాలాలు జోడించి పెరుగు చిలికి చేసే మజ్జిగ శరీరంలో వేడి చల్లారుస్తుంది. డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ల భరితం. వేసవి తాపంతో పోరాడటానికి మజ్జిగ ఒక మంచి ఆప్షన్. దీనిలో కేలోరీలు తక్కువ. కాల్షియం, పొటాషియంతో పాటు ప్రొటీన్ కూడా దీని నుంచి దొరుకుతుంది. అసిడిటీ తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కీరాదోస, పుదీనా రసం
కీరాదోస, పుదీనా రసం ఒక గొప్ప రిఫ్రెష్షింగ్ డ్రింక్. శరీరాన్ని త్వరగా చల్లబరుస్తుంది. క్యాలరీలు తక్కువ. నీరు ఎక్కువ. ఆంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. విటమిన్ సి వ్యాధి నిరోధక వ్యవస్థ బలానికి మంచిది. తరచుగా తీసుకుంటే బరువు కూడా తగ్గవచ్చు.
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లు ప్రకృతి ప్రసాదం. సోడియం, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్స్ చెమట ద్వారా విసర్జించబడిన వాటిని తిరిగి శరీరానికి అందిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మంచిది కోబ్బరి నీరు. క్యాలరీలు కూడా తక్కువ. ఆంటీఆక్సిడెంట్లు పుష్కలం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది కూడా.
సాఫ్ట్ డ్రింక్స్ మానేసి ఇవి తీసుకుంటే వేసవి ఆరోగ్యంగా, చల్లగా గడిచిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.