Spot Hidden Cameras in Changing Rooms : మాల్స్, పెద్ద షాపింగ్ స్టోర్​లలో చాలామంది డ్రెస్​లు కొనడానికి వెళ్తుంటారు. అయితే ఈ మాల్స్ ఎంత ఫ్యాన్సీగా కనిపిస్తాయో.. కొన్నిసార్లు వాటి వెనుక అంతే డేంజర్ దాగి ఉంటుంది. ఆడవారే కాదు.. మగవారు కూడా డ్రెస్​లు కొనేప్పుడు ఫిట్టింగ్ చెక్ చేసుకోవడం కోసం ట్రయల్ రూమ్స్​కి వెళ్తారు. అయితే అబ్బాయిల డ్రెస్సింగ్ రూమ్స్(Dressing Rooms) సంగతి దేవుడెరుగు గానీ.. అమ్మాయిల డ్రెస్సింగ్ రూమ్స్​లో చాలాసార్లు హిడెన్ కెమెరాలు పెట్టినట్లు వార్తలు చూస్తూ ఉంటాము. వాస్తవానికి ఈ కేసులు కొన్ని వెలుగులోకి వచ్చాక చాలా మాల్స్​లో చేంజింగ్ రూమ్​లో హిడెన్ కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు. 

Continues below advertisement

డ్రెస్​ ఫిట్టింగ్ కోసం ఆ రూమ్​లోకి వెళ్లి మార్చుకునే ప్రక్రియను ఇవి రికార్డ్ చేస్తున్నాయి. కాబట్టి మీరు ఎంత పెద్ద, పేరున్న షాప్ అయినా.. ట్రయల్ రూమ్ ఉపయోగించేప్పుడు ఆ రూమ్ బాగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు తాము వెళ్లిన చేంజింగ్ రూమ్​లో ఏదైనా హిడెన్ కెమెరా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అయితే అలాంటి హిడెన్ కెమెరాలను పట్టించే సింపుల్ చిట్కాలు ఇప్పుడు చూసేద్దాం.

చెక్ చేయండి.. 

మీరు ఎప్పుడైనా ట్రయల్ రూమ్‌కి వెళ్లినప్పుడు.. డ్రెస్ మార్చుకునే ముందు కెమెరా ఏమైనా ఉందా అని ఒకసారి చుట్టూ చెక్ చేయండి. అలాగే అక్కడ ఏదైనా వస్తువులు ఉంటే.. వాటిని కూడా బాగా తనిఖీ చేయండి. ఎందుకంటే వాటిలో కెమెరా దాగి ఉండొచ్చు. లైట్లు, అద్దాల చుట్టూ కూడా జాగ్రత్తగా చూడండి.

Continues below advertisement

లైట్లు ఆఫ్ చేసి చెక్ చేయండి 

చేంజింగ్ రూమ్‌లో దాచిన హిడెన్ కెమెరాను గుర్తించడానికి సులభమైన మార్గం లైట్లు ఆఫ్ చేయడం. మీరు చేయాల్సిందల్లా అన్ని లైట్లను ఆఫ్ చేసి చుట్టూ జాగ్రత్తగా చూడటం. చీకటి పడిన వెంటనే.. హిడెన్ కెమెరా నుంచి వచ్చే కాంతి మీకు కనిపిస్తుంది. కాంతిని విడుదల చేయని కెమెరాలను పట్టుకోవడానికి.. మీరు మీ మొబైల్ ఫ్లాష్‌ను ఆన్ చేయాలి. ఫ్లాష్ ఆన్ చేసి చుట్టూ తిరగండి. ఇలా చేయడం వల్ల హిడెన్ కెమెరా లెన్స్ ప్రతిబింబం కారణంగా మెరుస్తుంది. అప్పుడు ఈజీగా కెమెరాను గుర్తించవచ్చు. 

మొబైల్ యాప్​తో గుర్తించవచ్చు

ఇవేమి సాధ్యం కానప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్ సహాయంతో నిమిషాల్లోనే చేంజింగ్ రూమ్‌లో దాచిన హిడెన్ కెమెరాను గుర్తించవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్‌లోని ప్లేస్టోర్‌(Play Store)కి వెళ్లి హిడెన్ కెమెరా డిటెక్టర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆపై దీన్ని ఉపయోగించి.. మీరు కూడా సులభంగా హిడెన్ కెమెరాను గుర్తించవచ్చు. అంతే కాదు చాలా మొబైల్ యాప్‌లు నేరుగా వై-ఫైకి కనెక్ట్ చేసిన పరికరాలను స్కాన్ చేస్తాయి. కాబట్టి ముందుగానే వీటిని ఇన్​స్టాల్ చేసుకోండి. 

ఈసారి షాపింగ్​కి వెళ్లినప్పుడు రష్​గా డ్రెస్​లు ట్రయల్ చేయకుండా.. ముందుగా చెక్ చేసుకోండి. దీనివల్ల మీరు ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు. ఇతరులకు కూడా మంచిది.