Diwali Recipes: గులాబ్ జామూన్... నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోతుంది. అందుకే దీనికి అభిమానులెక్కువ. దీపావళికి కచ్చితంగా నోరు తీపి చేసుకోవాలన్న నమ్మకం ఉంది. అందుకే ఆ రోజు స్వీట్లు షేర్ చేసుకుంటారు. కొంతమంది స్వీట్లు కొంటారు. కొందరు ఇంట్లోనే సులువుగా చేసుకునే స్వీట్లను వండుతారు. అలా ఎక్కువమంది వండే స్వీట్ గులాబ్ జామూన్. దీన్ని తయారు చేయడం చాలా సులువు. కాబట్టి ఎక్కువ శాతం మంది దీపావళికి గులాబ్ జామూన్ వండుతారు. ఎప్పుడూ మైదా పిండితో గులాబ్ జామూన్లు చేసే కన్నా ఈసారి బ్రెడ్ తో చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. పైగా చేయడం చాలా సులువు. ఖర్చు కూడా తక్కువే అవుతుంది.


కావాల్సిన పదార్థాలు
తెల్లని బ్రెడ్ ముక్కలు - ఎనిమిది
పంచదార - ఒక కప్పు
మిస్క్ పౌడర్ - రెండు స్పూన్లు
ఫ్రెష్ క్రీమ్ - రెండు స్పూన్లు 
వేడి పాలు - అయిదు స్పూన్లు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
యాలకుల పొడి - అరస్పూను


తయారీ ఇలా
1. ముందుగా పంచదార సిరప్ ను రెడీ చేసి పెట్టుకోవాలి. 
2. ఇందుకు ఒక గిన్నెలో నీళ్లు పంచదార వేసి సన్నని మంట మీద మరిగించాలి. 
3. పంచదార సిరప్ రెడీ అయ్యాక స్టవ్ కట్టేసే ముందు యాలకుల పొడి చల్లుకోవాలి. 
4. ఇప్పుడు బ్రెడ్ ముక్కల అంచులను కత్తిరించేసి చిన్న ముక్కులు చిదుముకోవాలి. 
5. లేదా మిక్సీలో పొడి కొట్టుకున్నా సరిపోతుంది. 
6. ఆ బ్రెడ్ పొడిలో పాలపొడి, ఫ్రెష్ క్రీమ్, పాలు వేసి ముద్దలా కలుపుకోవాలి. 
7. ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. 
8. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక అందులో ఈ ఉండలను వేసి వేయించాలి. 
9. బ్రౌన్ రంగులోకి మారాక తీసి పంచదార సిరప్ లో వేయాలి. 
10. పంచదార సిరప్‌లో దాదాపు రెండు గంటల పాటూ ఉంచితే మెత్తగా మారతాయి గులాబ్ జామూన్లు. 
దీపావళికి పర్ఫెక్ట్ స్వీటు ఇది. చేయడం కూడా చాలా సులువు.  






Also read: ఆయుర్వేదం ప్రకారం ఆర్ధరైటిస్ నొప్పిని తగ్గించే పదార్థాలు ఇవే