Gas Cylinder Safety Tips : శీతాకాలంలో ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతాం. వేడిగా ఏమైనా తీసుకోవాలనిపిస్తుంది. దీనివల్ల గ్యాస్ సిలిండర్ వాడకం కూడా పెరుగుతుంది. అలాగే చలి లోపలికి రాకుండా ఉండేందుకు తలుపులు, కిటికీలు ఎక్కువగా మూసి ఉంచుతారు. దీనివల్ల వంటగదిలో గాలి ప్రసరణ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్‌కు సంబంధించిన చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
గ్యాస్ లీకేజీ, అగ్ని ప్రమాదాలు లేదా ఊపిరాడకపోవడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. అందువల్ల చలికాలంలో గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. దీనివల్ల మీ ఇల్లు, కుటుంబం రెండూ సురక్షితంగా ఉంటాయి.
వెంటిలేషన్‌పై దృష్టి పెట్టండి
చలికాలంలో బయటి గాలి చల్లగా ఉన్నప్పటికీ.. వంటగదిలో సరైన వెంటిలేషన్ ఉండటం చాలా ముఖ్యం. వంట చేస్తున్నప్పుడు కిటికీ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా ఆన్ చేయండి. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్‌ను ఎప్పుడూ చాలా చల్లని లేదా మూసి ఉన్న ప్రదేశంలో ఉంచవద్దు. సిలిండర్ ఎల్లప్పుడూ నిటారుగా, సమతలంగా ఉండే ప్రదేశంలో ఉంచాలి.
పైపు వంగిపోయిందా? లేదా వదులుగా ఉందా? అని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. గ్యాస్ వాసన కొద్దిగా వచ్చినా వెంటనే స్టవ్ ఆపి.. రెగ్యులేటర్ తీసేసి తలుపులు కిటికీలు తెరవండి. అలాంటి పరిస్థితుల్లో లైట్ లేదా స్విచ్ ఆన్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఇది స్పార్క్‌లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
సేఫ్టీ చెక్‌ను నిర్లక్ష్యం చేయవద్దు
చలికాలంలో గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్, పైపును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మరింత ముఖ్యం. పాత లేదా విరిగిపోయిన పైపులను వెంటనే మార్పించండి. ఎందుకంటే చలిలో రబ్బరు గట్టిపడి పగిలిపోవచ్చు. సిలిండర్‌కు అనుసంధానించిన రెగ్యులేటర్ సరిగ్గా లాక్ చేశారా? లేదా అని ప్రతిసారీ ఉపయోగించే ముందు తనిఖీ చేయించుకోవాలి. గ్యాస్ వెలిగించడానికి అగ్గిపెట్టె లేదా లైటర్‌ను మాత్రమే ఉపయోగించండి.
మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండండి. సిలిండర్ దగ్గర హీటర్ వంటివి ఉంచడం చాలా ప్రమాదకరం. అలాగే గ్యాస్ అయిపోయిన తర్వాత రెగ్యులేటర్ ఆపివేయడం అలవాటు చేసుకోండి. కొద్దిపాటి అప్రమత్తతతో చలికాలంలో పెద్ద ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు.