వేసవికాలం వచ్చిందంటే చాలు నోటిని చల్లబరిచే ఐస్ క్రీమ్, శీతల పానీయాల గురించి ఆలోచనలు మొదలై పోతాయి. ముఖ్యంగా ఐస్ క్రీములు రకరకాల ఫ్లేవర్లలో దొరుకుతూ కంటికే కాదు, మనసుకూ నచ్చేస్తున్నాయి. ఇక పిల్లల విషయానికి వస్తే ఐస్ క్రీమ్ అనేది ఒక భావోద్వేగం. వారికి ఏమి ఇచ్చినా అంత ఆనందం కలగదు, కానీ ఐస్ క్రీమ్ ఇస్తే మాత్రం ఎగిరి గంతేస్తారు. అంతగా ఐస్ క్రీమ్‌కు పిల్లలకు మధ్య అనుబంధం ఏర్పడింది. మార్కెట్లో ఎన్నో రకాల ఫ్లేవర్లు, రంగులతో, రుచులతో ఐస్ క్రీములు దొరుకుతున్నాయి. కానీ మొదటిసారి పురుగులతో గార్నిషింగ్ చేసిన ఐస్ క్రీములు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇంకా ఇవి మన దేశానికి చేరలేదు కానీ, కొన్ని దేశాల్లో ప్రస్తుతం అమ్మకాలు శరవేగంగా జరుగుతున్నాయి. 


ఈ పురుగుల ఐస్‌క్రీమ్‌కు సంబంధించి ఒక  ఇన్‌స్టాగ్రామ్ పోస్టు వైరల్‌గా మారింది. జర్మనీలోని ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ పై కీటకాలను గార్నిషింగ్ చేసి అమ్ముతున్నారు. వాటిని తినేందుకు జనాలు కూడా వస్తున్నారు. సాధారణంగా ఐస్ క్రీమ్ పై చాక్లెట్ ముక్కలను గార్నిషింగ్ చేసి ఇస్తారు, కానీ అక్కడ క్రికెట్ అని పిలిచే కీటకాలను గార్నిషింగ్ చేసి అందిస్తున్నారు. అంతేకాదు ఆ ఐస్‌క్రీమ్ తయారీలో కూడా ఈ పురుగులతో చేసిన పేస్టును వినియోగించారట. ఇంత తెలిసినా కూడా అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తింటున్నారు.


ఏమిటా పురుగులు?
అయితే ఐస్‌క్రీమ్ తయారీలో అన్ని రకాల పురుగులను వీరు వాడరు. కేవలం క్రికెట్ అని పిలిచే రాత్రిపూట అరుస్తూ ఉండే చిన్న కీటకాలను వినియోగిస్తారు. ఈ క్రికెట్ తినడాన్ని యూరోపియన్ యూనియన్ కూడా సమర్ధిస్తోంది. వీటిని పొడి రూపంలో తీసుకోవచ్చని సూచిస్తోంది. గత కొన్నేళ్లుగా ఆహారంలో ఈ కీటకాలు కూడా భాగం అయిపోయాయి. ఈ కీటకాల్లో ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయని, అందుకే తినమని ప్రోత్సహిస్తున్నట్టు యూరోపియన్ యూనియన్ చెబుతోంది. ఎప్పటినుంచో వాటిని ఆహారంగా తింటున్నప్పటికీ, ఐస్‌క్రీమ్‌లో భాగం చేయడం మాత్రం ఇదే తొలిసారి.


ఎవరు తయారు చేశారు?
జర్మనీలోని రోటెన్బర్గ్ కు చెందిన ఈస్కేఫ్ రినో అనే వ్యక్తి ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేశారు. అయితే కీటకాలతో ఐస్ క్రీమ్ ను తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది మాత్రం ఐస్ క్రీమ్ షాప్ యజమాని థామస్ నికోలినోకు. ఆయన ఆదేశం మేరకే రినో ఈ ఐస్ క్రీమ్‌‌ను తయారు చేశాడు. పర్యావరణానికి అనుకూలమైన ఐస్ క్రీములను రూపొందించాలనే ఆలోచన కొంతమందికి నచ్చడంతో ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అయిపోయింది. 






Also read: పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు, ఆయుర్వేదం చెప్పిన ఈ చిట్కాలను పాటించండి



Also read: తరచూ ముక్కు నుండి రక్తం కారుతుందా? అది ఆ తీవ్రమైన వ్యాధిని సూచిస్తుంది
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.