Fasting Technique for Digestion Problems : పొట్ట శరీరంలో ముఖ్యమైన, అవసరమైన భాగం. కడుపు సరిగ్గా ఉంటే.. సగం కంటే ఎక్కువ రోగాలు వాటంతట అవే నయం అవుతాయని అంటారు. కానీ నేటి సౌకర్యవంతమైన జీవనశైలి కారణంగా.. పొట్ట సంబంధిత సమస్యలు అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఆకలి లేకపోవడం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, పొట్టలో భారంగా అనిపించడం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే వీటికి చెక్ పెట్టాలంటే ఓ టెక్నిక్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ఈ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఏమి చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
ఫాస్టింగ్ చేస్తే కలిగే లాభాలు
అన్ని జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఫాస్టింగ్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్తున్నారు. ఈ ఉపవాసంలో మిమ్మల్ని మీరు ఆకలితో ఉంచుకోవలసి ఉంటుంది. కానీ ఇది ఏమాత్రం శిక్ష కాదు. ఇది ఒక ఔషధం. పొట్ట సంబంధిత వ్యాధులను కొంతవరకు మందులతో నయం చేయవచ్చు. కానీ కొంత సమయం తర్వాత మందుల ప్రభావం కూడా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో ఫాస్టింగ్ చేయడం మంచిదని చెప్తున్నారు. దీనివల్ల శరీరం లోపలి నుంచి శుభ్రపడుతుంది. ఏ మందులు చేయనంత ఎఫెక్టివ్‌గా పొట్టను లోతుగా శుభ్రపరుస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. శరీరాన్ని రిపేర్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది.
ఫాస్టింగ్ ఎలా చేయాలి?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఉపవాసం ఎలా చేయాలి? మొదట మీరు 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయడం ప్రారంభించవచ్చు. దీని కోసం ఏకాదశి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నెలకు రెండుసార్లు వస్తుంది. ఉపవాసం ప్రారంభంలో పండ్లను తీసుకోండి. శరీరానికి శక్తినిచ్చేంత మాత్రమే పండ్లను తినాలి. పొట్ట నింపుకోవడానికి పండ్లను ఫుల్‌గా తీసుకోకండి. తేనె కలిపిన నీరు, కొబ్బరి నీరు, సాధారణ నీటిని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. నీరు శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే ఉపవాసం వల్ల మీకు నీరసం వంటి ఇబ్బంది లేకుండా హెల్ప్ చేస్తుంది. క్రమంగా మీ స్టామినా బట్టి ఈ 15రోజులు కాస్త వారానికోసారి ఫాస్టింగ్ చేసుకోవచ్చు.
ఉపవాసం చేయడం వల్ల నీరసం వస్తుందా?
ఉపవాసం చేయడం వల్ల బలహీనంగా అనిపిస్తుందని కొందరు భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఇది మన మనస్సు భ్రమ మాత్రమే. ఎందుకంటే ఆహారం నుంచి శరీరానికి 30-40 శాతం మాత్రమే శక్తి లభిస్తుంది. మిగిలిన శక్తి నీరు, గాలి, విశ్రాంతి తీసుకోవడం ద్వారా లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉపవాసం చేయడం వల్ల బలహీనత వస్తుందని అనుకోవడం తప్పు. జపాన్ శాస్త్రవేత్తలు ఉపవాసంపై పరిశోధన కూడా చేశారు. 2018 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని చెడు కణాలను తొలగించి కొత్త, ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియను ఆటోఫాగీ అంటారు.
మధుమేహం, ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఫాస్టింగ్ విషయంలో వైద్యుల సూచనలు తీసుకోవాలి. మేము తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు తీసుకునే మోతాదును తగ్గించి తీసుకోవాలి. ఈ ఫాస్టింగ్ వల్ల దాదాపు జీర్ణ సమస్యలు సహజంగా తగ్గడం ప్రారంభిస్తాయి. మీరు కూడా యాక్టివ్‌గా మారుతారు. తేలికపాటి వ్యాయామం కూడా మీ రొటీన్లో యాడ్ చేస్తే.. సూపర్ హెల్తీగా ఉంటారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.