ప్రపంచవ్యాప్తంగా దమ్ బిర్యానికి వీరాభిమానులున్నారు. కేవలం బిర్యాని తినడానికే ఎంత దూరమైన ప్రయాణించి ఇతర నగరాలకు వెళ్లి తినేవాళ్లున్నారు. ప్లేటు బిర్యానీ ధర ప్రాంతాన్ని బట్టి రూ.100 నుంచి రూ.700 దాకా ఉంటుంది. ఇంకా ఫైవ్ స్టార్ హోటల్లో అయితే మరికొంచెం ఎక్కువ ఉండొచ్చు. కానీ ఓ హోటల్లో మాత్రం ప్లేటు బిర్యానీ ధర అక్షరాలా రూ.20,500. దీన్ని పొట్ట నిండా నలుగురు తినవచ్చు. దీన్ని అమ్ముతున్నది మన దేశంలో కాదు దుబాయ్‌లో. ‘బాంబే బారో’ అనే రెస్టారెంట్‌లో దీన్ని అమ్ముతున్నారు.
ఎందుకంత ధర?
ప్రపంచంలోనే అతి ఖరీదైన బిర్యాని కదా, స్పెషలిటీ లేకుండా ఎలా ఉంటుంది? ఈ బిర్యానీ పేరు ‘రాయల్ గోల్డ్ బిర్యాని’. ఆర్డర్ ఇచ్చాక 45 నిమిషాలకు బిర్యాని వస్తుంది. ఆ బిర్యానిని బంగారు పూత పూసిన బంగారుపళ్లెంలో తెస్తారు. తినేందుకు వీలైన బంగారు రేకులతో అలంకరించి తెస్తారు. ఆ ప్లేటు బిర్యానీ ఆర్డర్ ఇస్తే మూడు రకాల బిర్యానీలు ఇస్తారు. అందులో ఒకటి చికెన్ బిర్యాని, రెండోది కీమా బిర్యాని, కుంకుమ పువ్వు వేసి వండిన తెల్లన్నం, పైన ఉడకబెట్టిన బంగాళాదుంపలు, గుడ్లతో అలంకరించి ఇస్తారు. అలాగే గిల్డ్ చికెన్, మలై చికెన్, చికెన్ మీట్ బాల్స్, మటన్, మటన్ సీక్ కబాబ్లు, జీడిపప్పుతో ప్లేటు నింపేస్తాడు. ఆ ప్లేటను చూస్తేనే నోరూరిపోతుంది. అలాగే రైతాతో పాటు రెండు సలాన్‌లు అందిస్తాడు. దుబాయ్ లో దీని ధర వెయ్యి దీర్హమ్‌లు. అంటే మన రూపాయలలో 20,500. హైదరాబాద్ లో తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇలాంటి ఖరీదైన బిర్యానిని సర్వ్ చేస్తారు. కాకపోతే రేటు మరీ అంత ఉండదు.
[/insta]