Apatani Farming : వ్యవసాయం పేరుతో భూమిలోకి రసాయనాలు పోసే పద్ధతులను పక్కన పెట్టి.. దాదాపు 60 ఏళ్లుగా సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ.. వరి పంటతో పాటు చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని అపతాని తెగ. ప్రకృతిని పరిరక్షిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని జీరో లోయలో నివసించే అపతాని తెగ.. తరతరాలుగా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ప్రత్యేకమైన నీటి ఆధారిత వ్యవసాయ విధానాన్ని పాటిస్తున్నారు. దీనిని అపతాని పద్ధతి అంటారు. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా చురుకైన వ్యవసాయ మోడల్‌గా గుర్తింపు పొందుతోంది. దీని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అపతాని వ్యవసాయం
అపతాని వ్యవసాయ పద్ధతి ఇతర పద్ధతుల కంటే భిన్నంగా ఉంటుంది. వీరు పర్వత ప్రవాహాల నీటిని.. వెదురు కాలువలు, టెర్రస్ వ్యవస్థ ద్వారా నియంత్రించి.. వరి పంటను సాగు చేస్తారు. వెదురుతో నిర్మించే ఈ టెర్రస్ వ్యవస్థ నీటిని పొలాల్లో నిల్వ చేసేలా పనిచేస్తుంది.
ముందుగా వరి నాటి.. ఆపై చేపలను వదిలేస్తారు. ఈ పద్ధతిలో చేపలు పొలాల్లో ఉండే కీటకాలు, కలుపు మొక్కలు తిని బతుకుతాయి. అలాగే అవి ఈదడం వల్ల నేలలో గాలి ప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా పంట సారవంతంగా, హానికర కీటకాల లేకుండా పెరుగుతుంది. ఈ పద్ధతిని దాదాపు 60 ఏళ్లుగా ఫాలో అవుతూ చేపల పెంపకం, వరి పంట ద్వారా లాభాలు పొందుతున్నారు ఈ తెగ.
కంపోస్ట్, ఎరువులు
ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను, పశువుల ఎరువులను వీరు కంపోస్ట్‌గా మార్చి పొలాల్లో ఉపయోగిస్తారు. అలాగే అజోల్లా, లెమ్నా వంటి మొక్కలు నత్రజని స్థిరపరచి నేల మరింత సారవంతంగా మారేలా హెల్ప్ చేస్తాయి.
కూరగాయలు, పప్పులు, రాగులు వంటి అనేక పంటలు పండించేందుకు వీరు బండ్లు, సిమెంట్ పాత్రలు ఉపయోగిస్తారు. దీని వల్ల నీటి వృథా జరగదు. నిల్వ చేయడం కూడా సులభంగా ఉంటుంది.
అపతాని పద్ధతి వల్ల కలిగే లాభాలివే
ఈ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయడం వల్ల ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కెమికల్స్ వినియోగం తగ్గుతుంది. వరి, చేపలను కలిపి సాగు చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. అలాగే నీటి వనరులను సంరక్షించవచ్చు. కంపోస్ట్, నత్రజనిత మొక్కల వాడకం వల్ల భూమి సారవంతం అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న రసాయన వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఈ పద్ధతిని ఫాలో అవ్వొచ్చు.
ఈ పద్ధతులు ఫాలో అవుతూ అపతాని తెగ.. వ్యవసాయం మాత్రమే కాకుండా నీటి వనరుల సంరక్షణ, అటవీ ప్రాంతాల పరిరక్షణలోనూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి.. నీటి పంపిణీ, చేపల పెంపకం, పొలాల నిర్వహణ వంటి వ్యవస్థలను అందరూ కలిసికట్టుగా చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు.