వేసవి వచ్చిందంటే తినే ఆహారంలో చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా ద్రవపదార్థాలను అధికంగా తీసుకునేందుకే ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే టీ, కాఫీల విషయానికి వస్తే మాత్రం చక్కెర వేసుకుని కలుపుకుంటారు. బెల్లంతో చేసిన వంటకాలను పెద్దగా తినరు. కానీ వేసవిలో చక్కెరను పక్కనపెట్టి, బెల్లాన్ని తినవలసిన అవసరం ఉంది. చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం బెల్లమే. దీన్ని శుద్ధి చేయకుండా తయారు చేస్తారు. కాబట్టి బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పంచదారను అధికంగా ప్రాసెస్ చేసిన తర్వాత తయారు చేస్తారు. కాబట్టి దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు చాలా తక్కువ. కాకపోతే తీపిదనాన్ని మాత్రం ఎక్కువగా ఇస్తుంది. అదొక్కటే పంచదార వల్ల జరిగే మేలు. వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరిస్తున్నారు.


బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైనవి. చిన్న బెల్లం ముక్క రోజు తినడం వల్ల ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. అలాగే ఎవరైతే జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారో అంటే మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారో వారు రోజూ బెల్లం ముక్క తినడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రతి రోజూ భోజనం తిన్నాక చిన్న బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకోవాలి.


గొంతు నొప్పికి మంచి ఔషధంలా పనిచేస్తుంది బెల్లం. మీరు చేయవలసిందల్లా కొన్ని తులసి ఆకులను మెత్తగా నూరి రసం తీయాలి. ఆ రసంలో బెల్లం కలుపుకోవాలి. దాన్ని రోజూ రెండు మూడు సార్లు ఒక చెంచాడు తాగడం వల్ల గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. బెల్లంలోను, తులసి ఆకుల్లోనూ కూడా ఔషధ గుణాలు ఎక్కువ.


వాతావరణం చల్లగా మారినప్పుడు బెల్లం తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక కప్పు నీటిని వేడి చేసి దానిలో బెల్లం వేస్తే బెల్లం ముక్క దానంతట అదే కరిగిపోతుంది. తర్వాత కొద్దిగా అల్లం కూడా వేసి బాగా మరగనివ్వాలి. దాన్ని వడకట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు వెంటనే తగ్గుతుంది. రోజుకి మూడు, నాలుగు సార్లు తాగితే త్వరగా జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది.


మహిళల్లో పీరియడ్స్ సమయంలో నొప్పి, తిమ్మిరి వంటివి బాధిస్తాయి. వీటికి బెల్లం చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. కొంచెం పాలను వేడి చేసి అందులో బెల్లం కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి.


శరీరంలో నీరు నిలిచిపోవడం వల్ల శరీరం ఉబ్బినట్టు కనిపిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా ఉంటే మంచిది కాదు. కాబట్టి రెండు కప్పుల నీటిలో ఒక టీ స్పూన్ బెల్లం పొడి వేసి, రెండు టీ స్పూన్ల సోంపు గింజలు వేసి మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని వడకట్టి రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోవడం తగ్గుతుంది.


Also read: ఉప్పు తగ్గించండి, కానీ పూర్తిగా తినడం మానేయకండి - మానేస్తే ఈ సమస్యలు తప్పవు








































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.