Oarfish Tsunami Connection : తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తాజాగా తిరువైకుళం కోస్ట్ దగ్గర్లో ఓ వింతైన చేపను పట్టుకున్నారు. అయితే ఇది చూసేందుకు చాలా పొడుగ్గా, సిల్వర్ కలర్ శరీరాన్ని కలిగి ఉంది. అలాగే దానికి తలపైత ఎరుపు రంగులో పెద్ద క్రెస్ట్ కూడా ఉంది. అయితే దీనిని చూసిన కొందరు ఇది ప్రమాదానికి సంకేతమని చెప్తున్నారు. భూకంపాలు, సునామీలు జరిగే ముందు ఈ చేప ఒడ్డుకు వస్తుందంటూ జోస్యాలు చెప్పేస్తున్నారు. అసలు ఈ చేప గురించిన వివరాలు ఏంటి? దీనికి సునామికి ఉన్న సంబంధం ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఓర్ ఫిష్
సముద్రంలో ఉండే ఈ వింత జీవిని ఓర్ ఫిష్ (Doomsday Fish aka Oarfish) అంటారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఎముకని కలిగి ఉన్న ఫిష్ ఇది. దాదాపు 11 మీటర్లు (36 అడుగులు) పెరుగుతుంది. పొడవైన పాములాగా కనిపించే ఓర్ఫిష్ సముద్రంలో లోతైన ప్రాంతంలో జీవిస్తుంది. 200 నుంచి 1000 అడుగుల కంటే ఓర్‌ఫిష్‌లు లోపల జీవిస్తాయి. ఈ సముద్ర జీవులు హాని చేసే రకం కాదు. పైగా చాలా అరుదుగా కనిపిస్తాయి. అవి చనిపోయినప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడే ఎక్కువగా కనిపిస్తాయి.
సునామీతో సంబంధం ఏమిటి?
జపాన్‌కు చెందిన కొన్ని సంస్కృతులలో ఓర్ ఫిష్ గురించి ప్రస్తావన ఉంది. సముద్ర దేవుడు వీటి ద్వారా సందేశం ఇచ్చినట్లు వారు భావిస్తారు. సముద్రంలో భూకంపాలు వచ్చే ముందు ఇవి తీరానికి వస్తాయంటారు. ఈ నేపథ్యంలోనే నీటి అడుగున జరిగే భూకంపాలు, సునామీలను ఈ జీవులు అంచనా వేస్తాయని వారు నమ్ముతారు.
2011లో ఏమైందంటే..
జపాన్‌లో 2011లో సునామీ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో నెలలోపు 20 ఓర్‌ఫిష్‌లు కనిపించాయని.. ఆ తర్వాత జపాన్‌లో సునామీ, భూకంపం వచ్చినట్లు చెప్తారు. అప్పటి నుంచి ఈ ఓర్‌ఫిష్‌లను డూమ్స్ డే ఫిష్‌గా పిలుస్తున్నారు.
మరో సునామీ తప్పదా?
తాజాగా తమిళనాడులో ఓ ఓర్ఫిష్ దొరికింది. కొద్ది రోజుల ముందే తస్మానియా వెస్ట్ కోస్ట్‌లో చనిపోయిన ఓర్ఫిష్ కనిపించింది. ఈ రెండూ దాదాపు కొద్ది రోజుల్లోనే కనిపించడంతో సునామీ, భూకంపం వస్తాయా అనే భయం కొందరిలో పెరిగింది.
ఇటీవలె లెవియాథన్ ప్రస్తావన గురించిన వార్తలు చాలా వైరల్ అయ్యాయి. వాటిని ప్రపంచ అంతానికి చిహ్నంగా భావించి.. వాటికి సంబంధించిన పలు స్టోరీలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు ఓర్ఫిష్ గురించి కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీంతో సముద్రంలో ఏదో జరుగుతుందని.. అందుకే ఇవన్నీ వినిస్తున్నాయని చాలామంది భావిస్తున్నారు.
శాస్త్రీయ ఆధారాలు
శాస్త్రవేత్తలు మాత్రం వీటిని తోసిపుచ్చుతున్నారు. ఎందుకంటే వారి నమ్మకానికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అవి బయటకు రావడానికి అనారోగ్య కారణాలు ఉండొచ్చని.. సముద్రంలో వాతావరణ మార్పులు కూడా వాటిని బయటకు వచ్చేలా చేస్తాయని.. అంతేకానీ వీటికి సునామీకి, ఎలాంటి సంబంధం లేవని చెప్తున్నారు. కాబట్టి వదంతులు నమ్మకపోవడమే మంచిదని చెప్తున్నారు.