Halloween 2022: పండుగ అంటే అది కచ్చితంగా దేవుడిని ప్రార్థించే రోజుగానే భావిస్తాం. ఆరోజు కొత్త బట్టలు, రకరకాల నైవేద్యాలు, పూజా పునస్కారాలతో ఇల్లు సందడిగా మారిపోతుంది. దేవతల కరుణ కోసం పండుగలు చేసుకోవడం సాధారణమే కానీ ‘హలోవీన్’ మాత్రం కేవతం ఆత్మల కోసం చేసే పండుగ. ఆరోజు దయాల్లా తయారై వీధుల్లో తిరుగుతారు జనాలు. మనదేశంలో దీనికి పెద్ద ప్రాముఖ్యత లేదు కానీ, అనేక పాశ్చాత్య దేశాల్లో ఇది ప్రధాన పండుగ.
వారే ఆద్యులు
ఈ పండుగ పుట్టుక వెనుక సెల్ట్స్ అనే తెగ ప్రజలు ఉన్నారని చరిత్ర చెబుతోంది. వారు క్రీస్తు పూర్వం ఐర్లాండ్, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో నివసించేవారట. వారే మొదట ఈ హలోవీన్ పండుగను నిర్వహించారని అంటారు. కాకపోతే ఈ పేరుతో కాకుండా ‘సమ్ హైయిన్’ అనే పేరుతో ఈ పండుగను పిలిచేవారు. ప్రతి ఏడాది అక్టోబర్ 31న ఈ వేడుకను నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే తరాలుగా వస్తూ ఇప్పటికీ అనేక దేశాల్లోని ప్రజలు అచరిస్తున్నారు.
ఎందుకు?
నవంబర్ సెల్ట్స్ ప్రజలకు చలి పుట్టించే నెల. చలితో పాటూ అనేక రోగాలు కూడా వస్తాయి. అందుకే నవంబర్ నెలను ‘మరణం నెల’గా భావించేవారు ఆ తెగ ప్రజలు. రాత్రి సమయం ఎక్కువ ఉండి, పగలు సమయం తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పంటలు పెరగడం కూడా చాలా కష్టం. అంతేకాదు చల్లని ఈ నెలలో ఆత్మలు భూమిపైకి వచ్చి ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాయని, తమ ఆస్తులను, పంటలను నాశనం చేస్తాయని వారు నమ్మేవారు. అందుకే నవంబర్ మొదలు కావడానికి ఒకరోజు ముందే ‘సమ్ హైయిన్’ పండుగను నిర్వహించే వారు. అక్టోబర్ 31 రాత్రి ఇళ్ల మధ్యన మంటలు పెట్టేవాళ్లు. వాటి చుట్టూ చేరి దైవాన్ని ప్రార్థించేవారు. జంతవుల చర్మాలను ధరించేవారు, వాటి తలలను తగిలించుకునేవారు. ఇలా చేసుకున్న ఈ పండుగే తరువాత హోలోవీన్‌గా మారిందని అంటారు.
19వ శతాబ్ధం ముందు వరకు అమెరికాకు హలోవీన్ పండుగంటే తెలియదు. కానీ ఆ శతాబ్ధంలో ఈ పండుగ పరిచయం అయింది. ఇప్పుడు ఈ వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రజలు దయ్యాల్లా రెడీ అయి రాత్రి పూట వీధుల్లో తిరుగుతూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దయ్యాల్లా డ్రెస్సులు వేసుకుని తిరగడం వల్ల భూమిపైకి వచ్చిన ఆత్మలు వారు తమలా ఆత్మలే అనుకుంటాయని కూడా ఓ వాదన ఉంది.
గుమ్మడికాయల్లో దీపాలు
హలోవీన్‌కు గుమ్మడికాయల అమ్మకాలు జోరందుకుంటాయి. ఎక్కడ చూసినా గుమ్మడికాయలకు కళ్లు, కోర పళ్లు చెక్కి లోప దీపాలు పెట్టి ఉంచుతారు. గుమ్మడి కాయల్లో దీపాలు వెలిగించి ప్రతి ఇంటి ముందు పెడితే, భూమ్మీదకు వచ్చిన ఆత్మలు ఇంట్లోకి మాత్రం ప్రవేశించవని నమ్ముతారు. అందుకే గుమ్మడి దీపాలు హలోవీన్‌కు ప్రత్యేక ఆకర్షణ.
Also read: సమంతకున్న ఈ వ్యాధి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త