నలో చాలా మంది రాత్రి వేళ టైమ్ కి అసలు నిద్రపోరు. ఒక్కో రోజు ఒక్కో టైమ్ కి పడుకుంటూ ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. రాత్రివేళ నిద్రని 90 నిమిషాలు ఆలస్యం చేయడం వల్ల రక్త నాళాలకు సంబంధించిన కణాలని దెబ్బతీస్తుంది. దాని ప్రభావం ఎక్కువగా పడేది గుండె మీదే. దీనికి సంబంధించి ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం పేలవమైన నిద్ర గుండె వ్యాధుల ప్రమాదాన్ని మరింత పెంచుతుందని మరోసారి రుజువైంది. దీర్ఘకాలిక నిద్రలేమి గుండె జబ్బులు కలిగిస్తుంది. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో కొలంబియా విశ్వవిద్యాలయం చేసిన ఒక కొత్త అధ్యయనం ప్రచురితమైంది. దీర్ఘకాలిక తేలికపాటి నిద్రలేమి సమయం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో వాళ్ళు విశ్లేషించారు.


అందులో ఏముందంటే..


పన్నెండు వారాల పాటు అధ్యయనం సాగింది. పరిశోధకులు దాదాపు వెయ్యి మంది మహిళలని అధ్యయనం కోసం పరీక్షించారు. ప్రతి రాత్రి సాధారణంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయే 35 మంది ఆరోగ్యకరమైన మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఆరు వారాల పాటు మహిళలు తమ సాధారణ దినచర్య ప్రకారం నిద్రపోయారు. మిగిలిన ఆరు వారాలు సాధారణం కంటే 1.5 గంటలు ఆలస్యంగా పడుకున్నారు. ఇందులో పాల్గొన్న వారికి మణికట్టుకి స్లీప్ ట్రాకర్ అమర్చారు. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయి. కానీ గంటన్నర పాటు ఆలస్యంగా పడుకున్న వ్యక్తులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి హృదయనాళ ప్రమాదాన్ని తీవ్రతరం చేసింది.


సరైన సమయానికి నిద్రపోకపోవడం వల్ల రక్తనాళాలు లైన్ చేసే కణాల ఆక్సిడెంట్లు దెబ్బతీస్తాయి. బాగా విశ్రాంతి పొందిన కణాల మాదిరిగా కాకుండా నిద్ర నిరోధిత కణాల పనితీరు మందగిస్తుంది. తేలికపాటి నిద్ర లోపాలు గుండె జబ్బులకి కారణమవుతాయని ఈ అధ్యయనానికి అధ్యక్షత వహించిన పరిశోధకులు తెలిపారు.


నిద్రలేమి వల్ల మతి పోతుందా?


నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. దీని కంటే తక్కువ నిద్రపోతే మతిమరుపు, నిరాశ, బరువు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదురవుతాయి. స్లీప్ అప్నియా, జెట్ లాగ్, రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి అనేక కారణాల వల్ల నిద్రలో ఇబ్బంది ఏర్పడుతుంది. డిప్రెషన్, స్కిజోఫ్రేనియా, క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ ఉన్న వారిలో నిద్రలేమి సాధారణంగా కనిపిస్తుంది. దీని నుంచి బయట పడేందుకు మనసు వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిద్ర నాణ్యతని మెరుగు పరిచే ఆహార పదార్థాలు తీసుకోవాలి.


ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం ధ్యానం, యోగా వంటివి చేయడం మంచిది. రాత్రిపూట ఆలస్యంగా భోజనం అసలు చేయకూడదు. అతిగా తినకుండా తేలికపాటి భోజనాన్ని ఎంచుకుంటే మంచిది. తిన్న తర్వాత నిద్రపోవడానికి కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ నిద్ర నాణ్యతని మెరుగుపరుచుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: మెడికల్ మిరాకిల్ - కోతికి పంది కిడ్నీ, రెండేళ్లుగా హాయిగా జీవించేస్తోన్న వానరం