Dead Body in Space It Decompose or Turn Into a Mummy : భూమితో పోలిస్తే అంతరిక్ష వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ఎవరైనా చనిపోతే.. వారి మృతదేహం కుళ్లిపోతుందా అనే డౌట్ రావడం చాలా సహజం. ఎందుకంటే అక్కడ గాలి ఉండదు. వాతావరణ పీడనం ఉండదు. ఉష్ణోగ్రతలు అత్యంత అధికంగా ఉంటాయి. ఇంతటి కఠినమైన పరిస్థితులలో ఒక మృతదేహం కుళ్లిపోతుందా? లేదా మమ్మీగా మారుతుందా? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మమ్మీలా మారుతుందా?

స్పేస్​లో తగినంత గాలి లేకపోవడం వల్ల డెడ్​బాడీలోని నీరు, రక్తం వంటి శరీర ఇంధనాలు వేగంగా ఆవిరైపోతాయి. దీనివల్ల శరీరం ఎండిపోయి కుంచించుకుపోతుంది. ఇది సహజమైన మమ్మీ ప్రక్రియను పోలి ఉంటుంది. తేమ లేకుండా మృతదేహం కుళ్లిపోవడం జరగదు.

బిగుసుకుపోతుంది..

ప్రత్యక్ష సూర్యరశ్మి లేకపోతే.. అంతరిక్షంలో ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతుంది. దీనివల్ల శరీరం నెమ్మదిగా వేడిని కోల్పోతుంది. సుమారు 12 నుంచి 26 గంటలలోపు డెడ్​బాడీ గడ్డకడుతుంది.

కుళ్లిపోతుందా?

భూమిపై మృతదేహం కుళ్లిపోవడానికి బ్యాక్టీరియా ప్రధాన కారణంగా ఉంటుంది. వాటి మనుగడకు ఆక్సిజన్ అవసరం. అంతరిక్షంలో ఆక్సిజన్ కొరత బ్యాక్టీరియా కార్యకలాపాలను త్వరగా నిలిపివేస్తుంది. దీనివల్ల సాధారణ కణజాలం కుళ్లిపోయే ప్రక్రియను కోల్పోతుంది.

కొన్ని సంవత్సరాల ప్రక్రియ

కణజాల విచ్ఛిన్నం ఆగిపోయినప్పటికీ.. విశ్వ కిరణాలు శరీరాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఈ కిరణాలు నెమ్మదిగా కణాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాయి. అలాగే కణజాలాలను బలహీనపరుస్తాయి. అయితే ఈ ప్రక్రియ జరగడానికి కొన్ని సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది.

స్పేస్ సూట్​లో ఉంటే..

చనిపోయిన వ్యక్తి శరీరం స్పేస్‌సూట్‌లో ఉంటే.. అందులో ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్ వల్ల బ్యాక్టీరియా కొద్దిసేపు చురుకుగా ఉంటుంది. అయితే ఆక్సిజన్ అయిపోయి.. ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత.. కుళ్లిపోవడం ఆగిపోయి శరీరం అలా ఉండిపోతుంది. 

భూమిపై కుళ్లిపోవడానికి ఎంత సమయం పడుతుంది?

భూమిపై మృతదేహాలు కుళ్లిపోవడానికి కొన్ని వారాలు లేదా నెలల సమయం పడుతుంది. అయితే అంతరిక్షంలో మృతదేహాలు చాలా కాలం పాటు గడ్డకట్టి లేదా మమ్మీలుగా మారి ఉంటాయి. డైరక్ట్ సన్​లైట్ పడితే.. యూవీ రేడియేషన్ వల్ల చర్మం నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంది. ఆక్సిజన్, తేమ, సూక్ష్మజీవులు లేకపోవడంతో.. కుళ్లిపోయే ప్రక్రియ దాదాపు పూర్తిగా ఆగిపోతుంది. 

అలాగే భూమిపై ఉన్నట్లుగా దుర్వాసన కూడా ఉండదు. అయితే అంతరిక్షంలో ప్రెజర్ లేకపోవడం వల్ల గ్యాస్‌లు విస్తరించి శరీరం కొంచెం ఉబ్బే అవకాశం ఉంది. ఇది పూర్తిగా అక్కడి పరిస్థితులపై ఆధారపడుతుంది.