Scalp Cleaning Tips to Prevent Dandruff : తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా మారడం, పదేపదే దురద పెట్టడం, తెల్లటి పొట్టు రాలడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. దీనిని కొందరు చుండ్రు అనుకుని తరచూ షాంపూ మారుస్తుంటారు. మరికొందరు జుట్టుకు ఎక్కువగా నూనె రాస్తుంటారు. కానీ స్కాల్ప్‌పై పేరుకుపోయిన జిడ్డు, డెడ్ స్కిన్ సెల్స్, హెయిర్ ప్రొడక్ట్స్ కూడా ఈ సమస్యలకు కారణం కావచ్చు. అందుకే జుట్టును మాత్రమే కాకుండా తల చర్మాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. 

Continues below advertisement

రెండుసార్లు వాష్ చేయండి

జుట్టుకు తరచూ నూనె, సీరమ్స్, హెయిర్ స్ప్రేలు ఉపయోగించేవారిలో స్కాల్ప్​పై అవశేషాలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కసారి షాంపూ చేయడం వల్ల పూర్తిగా శుభ్రం కాకపోవచ్చు. మొదటిసారి షాంపూ చేసినప్పుడు జిడ్డు, ప్రొడక్ట్స్ అవశేషాలు తొలగిపోతాయి. రెండోసారి తల చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేసుకోవచ్చు. దీనివల్ల స్కాల్ప్ శుభ్రమవుతుంది. 

Also Read : తలస్నానం తర్వాత జుట్టుకు నూనె రాయడం మంచిదేనా? డ్రై, ఆయిలీ హెయిర్ ఉన్నవారు ఏమి చేయాలి?

Continues below advertisement

క్లారిఫైయింగ్ షాంపూ 

సాధారణ షాంపూతో తొలగని జిడ్డు, సిలికాన్ ఆధారిత హెయిర్ ప్రొడక్ట్స్ అవశేషాలు, నీటిలోని ఖనిజ లవణాలు స్కాల్ప్‌పై పేరుకుపోవచ్చు. వీటిని తొలగించడానికి క్లారిఫైయింగ్ షాంపూలు ఉపయోగపడతాయి. అయితే వీటిని ప్రతిసారీ వాడకూడదు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువగా వాడితే స్కాల్ప్​ పొడిబారడం, చికాకు పెట్టడం వంటి సమస్యలు రావచ్చు.

స్కాల్ప్ ఎక్స్‌ఫోలియేషన్

స్కాల్ప్​పైన కూడా డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోతుంటాయి. దీనివల్ల పొట్టు, జిడ్డు, మురికి కలిసి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అందుకే అప్పుడప్పుడు స్కాల్ప్‌కు అనుకూలమైన ఎక్స్‌ఫోలియేటింగ్ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. గట్టిగా రుద్దడం, పదునైన పదార్థాలతో స్కాల్ప్‌ను గీకడం వంటివి చేయకూడదు. 

Also Read : తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెన్నా బెటరా? లేదా కలర్ వేసుకోవాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే  

మసాజ్ చేయండి

షాంపూ చేసేటప్పుడు తలపై సున్నితంగా మసాజ్ చేయడం మంచిది. దీనివల్ల స్కాల్ప్​పై ఉన్న జిడ్డు, మురికిని తొలగించడం ఈజీ అవుతుంది. ఇందుకోసం గోళ్లను ఉపయోగించకుండా వేళ్ల చివరి భాగాలతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. వృత్తాకారంగా సున్నితంగా కదిలిస్తూ శుభ్రం చేసుకోవాలి. 

ఎక్కువ నూనె రాయకండి

జుట్టు పొడిబారకుండా ఉండేందుకు చాలామంది ఎక్కువ మొత్తంలో నూనె రాసి గంటల తరబడి అలాగే ఉంచుతారు. అయితే స్కాల్ప్ ఇప్పటికే జిడ్డుగా ఉన్నప్పుడు అధికంగా నూనె రాయడం వల్ల మరింత అసౌకర్యం కలగవచ్చు. ముఖ్యంగా చుండ్రు సమస్యకు కారణమయ్యే ఈస్ట్ పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అవసరానికి మించి నూనె రాయకుండా, మీ స్కాల్ప్ స్వభావాన్ని రాయాల్సి ఉంటుంది.

Also Read : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు

షాంపూ, కండిషనర్ 

తలస్నానం చేసిన తర్వాత కూడా దురద వస్తుంటే షాంపూ లేదా కండిషనర్ అవశేషాలు మిగిలిపోయాయేమో చెక్ చేయండి. ముఖ్యంగా చెవుల వెనుక, మెడ దగ్గర, తల పైభాగంలో ఉత్పత్తుల అవశేషాలు ఉండిపోవచ్చు. అందుకే తలస్నానం చేసేటప్పుడు తగినంత నీటితో జుట్టును పూర్తిగా కడగాలి. 

స్కాల్ప్‌ను బట్టి తలస్నానం

జిడ్డు స్కాల్ప్ ఉన్నవారు అవసరాన్ని బట్టి ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయవచ్చు. పొడి స్కాల్ప్ ఉన్నవారు తమ జుట్టు, చర్మ పరిస్థితిని బట్టి తలస్నానం చేసే వ్యవధిని నిర్ణయించుకోవాలి. సాధారణంగా వారానికి మూడు సార్లు తలస్నానం చేయడం కొందరికి సరిపోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించే నియమం కాదు. చెమట, వాతావరణం, జుట్టు రకం, స్కాల్ప్ పరిస్థితిని బట్టి మారుతుంది.

ఈ చిట్కాలు పాటించినా చుండ్రు, తీవ్రమైన దురద, ఎర్రబడటం లేదా పొట్టు రాలడం తగ్గకపోతే అది కేవలం స్కాల్ప్‌పై పేరుకున్న మురికి సమస్య కాకపోవచ్చు. సెబోరిక్ డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలు కూడా కారణం కావచ్చు. అలాంటప్పుడు సొంతంగా రకరకాల ఉత్పత్తులు వాడకుండా చర్మ వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read : ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.