‘కరోనా వైరస్ గురించి మనకు అర్థమైంది కొంతే... ఇంకా దాని గురించి తెలుసుకోవాల్సింది ఉంది, అయితే ఒక విషయం మాత్రం నిజం. భవిష్యత్తులో కరోనా సాధారణ జలుబులా మారిపోతుంది. కాకపోతే దీనికి కాస్త సమయం పడుతుంది’ ప్రముఖ ఇంగ్లాండు నేషనల్ హెల్త్ సర్వీస్ వ్యవస్థాపకులు సర్ మాల్కం గ్రాంట్ తాజాగా అన్న మాటలివి. కరోనాను మనం జయించే రోజులు దగ్గరలో ఉన్నాయన్నది ఆయన మాటల సారాంశం. అయితే కరోనాను పూర్తిగా నిర్మూలించలేమని, దాన్ని బలహీన పరిచి సాధారణ జలుబులా వచ్చి పోయేలా చేయవచ్చన్నది చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం.  ఇంగ్లాండులో కరోనా వల్ల పరిస్థితులు దిగజారాయని కానీ శీతాకాలం గడిచాక వచ్చే వేసవికి పరిస్థితులు చక్కబడతాయని అన్నారు మాల్కం గ్రాంట్.


ఇంగ్లాండు ఆరోగ్యనిపుణులు మాత్రమే కాదు ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ సర్ జాన్ బెల్ కూడా ఇదే భావాన్ని వ్యక్తపరిచారు. వచ్చే ఏడాది వేసవి కల్లా అన్ని దేశాల్లోను పరిస్థితి చక్కబడుతుందని చెప్పారు. దీనికి కారణం ప్రజల్లో వ్యాక్సినేషన్ జోరుగా సాగడమేనని, దీని వల్ల వైరస్ బలహీనంగా మారుతోందని వివరించారు. ఆ తరువాత కరోనా... సాధారణ జలుబు, జ్వరంలా మారుతుందని చెప్పుకొచ్చారు. వీరి వ్యాఖ్యలు ప్రజలకు చాలా ఊరటనిచ్చేవిలా ఉన్నాయి. 


ఆస్ట్రోజెనెకా టీకా సృష్టికర్తల్లో ఒకరైన డేమ్ సారా గిల్బర్ట్ కూడా ఇలాంటి వాదనలే తెరపైకి తెచ్చారు. కోవిడ్-19 ఇక ప్రమాదకరమైన వేరియంట్ గా మారే అవకాశం లేదని, జలుబులా మారిపోతుందని అన్నారు. రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ వెబ్ నార్ లో మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి చెందుతున్న కొద్దీ బలహీనపడుతున్నాయని చెప్పారామె. కరోనాను బలహీనపరిచేందుకు దేశాల్లోని ప్రజలంతా త్వరితంగా వ్యాక్సిన్లేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. అప్పుడే కరోనా వేరియంట్లుగా మారకుండా అడ్డుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏదైనా కరోనాను జయించే రోజులు రాబోతున్నాయని మాత్రం అర్థమవుతోంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం


Also read: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...


Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి