Social Media Fame vs Financial Reality : ఈ రోజుల్లో చాలామంది కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటున్నారు. ముఖ్యంగా కొత్త తరం.. అంటే జెన్ జీ వాళ్లకి ఈ తరహా కంటెంట్​పై ఆసక్తి ఎక్కువగా ఉంది. తమ సోషల్ మీడియాలో అకౌంట్​లలో ఫాలోవర్లను పెంచుకోవడానికి, లైక్స్ పొందడానికి, వైరల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫన్నీ వీడియోలు, చిన్న చిన్న రీల్స్ లేదా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తే ప్రతి ఒక్కరూ దీనిలో కంటెంట్ ఇస్తూ.. బాగా డబ్బు సంపాదిస్తున్నారని అనిపించవచ్చు. కానీ నిజానికి ఏమి జరుగుతుంది? సోషల్ మీడియాలో డబ్బు సంపాదించడం నిజమేనా?

Continues below advertisement

భారతదేశంలో దాదాపు 20 నుంచి 25 లక్షల మంది ప్రతిరోజూ మొబైల్ స్క్రీన్‌లపై తమ కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ దీని ద్వారా త్వరగా డబ్బు సంపాదించవచ్చని అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే.. కొద్దిమంది మాత్రమే సోషల్ మీడియా ద్వారా మంచి ఆదాయం సంపాదించగలుగుతున్నారు. 

కంటెంట్ క్రియేటర్ ఎకానమీ ఎలా ఉందంటే..

భారతదేశంలో కంటెంట్ క్రియేషన్ సుమారు 15 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఆ సమయంలో చాలామంది దీనిని ఉద్యోగంగా లేదా ఆదాయ మార్గంగా పరిగణించడానికి సంకోచించారు. చాలామంది కంటెంట్ క్రియేటర్లను నిరుద్యోగులుగా భావించారు. అంటే వారికి ఏమి పనిలేదు కాబట్టి ఇవి చేస్తున్నారనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ సంవత్సరం మే నెలలో ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్‌లో.. భారతదేశంలోని డిజిటల్ క్రియేటర్లు ప్రతి సంవత్సరం సుమారు 350 బిలియన్ డాలర్ల కస్టమర్ స్పెండింగ్‌ను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ సంఖ్య 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందట. అంటే భారతదేశ కంటెంట్ క్రియేటర్ ఎకానమీ భవిష్యత్తులో 1 లక్ష కోట్ల డాలర్లు అవుతుంది.

Continues below advertisement

ప్రభుత్వం కూడా సోషల్ మీడియా కంటెంట్​పై ప్రత్యేక దృష్టిని పెట్టింది. మార్చి 2025లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. క్రియేటర్ ఎకానమీని పెంచడానికి 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. అంటే మొబైల్ స్క్రీన్‌లపై మీరు చూసే చిన్న చిన్న వీడియోలు పెద్ద పెద్ద బ్రాండ్‌లు, కంపెనీలకు ఒక కొత్త సేల్స్ ఫోర్స్‌గా పనిచేస్తున్నాయని స్పష్టమవుతోంది. 

నిజమైన ఆదాయం ఎంతమందికి వస్తుంది?

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం.. కేవలం 8-10 శాతం క్రియేటర్లు మాత్రమే తమ కంటెంట్ ద్వారా మంచి ఆదాయం సంపాదించగలుగుతున్నారు. అంటే 20-25 లక్షల మంది యాక్టివ్ క్రియేటర్లలో కేవలం 2 నుంచి 2.5 లక్షల మంది మాత్రమే డబ్బు సంపాదించగలుగుతున్నారు. మిగిలిన 90-92 శాతం క్రియేటర్లు చాలా తక్కువ సంపాదిస్తున్నారు. లేదా సోషల్ మీడియా వారి ప్రధాన ఆదాయ వనరు కాకపోయి ఉండొచ్చు. దీని అర్థం ప్రతి ఒక్కరూ వైరల్ అవ్వడం లేదా కోట్లు సంపాదించే కథను రాయలేరని స్పష్టమవుతోంది. 

కంటెంట్ క్రియేటర్లు డబ్బు ఎలా సంపాదిస్తారు?

సక్సెస్ అయిన క్రియేటర్లకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉంటారు. దీనివల్ల వారికి డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఓపెన్ అవుతాయి. బ్రాండ్ భాగస్వామ్యాలు, పెద్ద బ్రాండ్‌లు వారి వీడియోల ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తాయి. స్పాన్సర్‌షిప్‌లు, కంపెనీలు తమ ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడానికి వారికి నేరుగా డబ్బు చెల్లిస్తాయి. ప్లాట్‌ఫారమ్ యాడ్స్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ నుంచి వీడియోలపై యాడ్స్ ద్వారా డబ్బు వస్తుంది.

అఫిలియేట్ మార్కెటింగ్, ప్రొడెక్ట్ లింక్‌ను షేర్ చేయడం ద్వారా అమ్మకాలపై కమీషన్, సబ్‌స్క్రిప్షన్, ప్రీమియం కంటెంట్, ప్రత్యేక కంటెంట్ కోసం ఫాలోవర్లు సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అత్యధిక డబ్బును ప్లాట్‌ఫారమ్‌లే సంపాదిస్తున్నాయి. క్రియేటర్లు కాదు. యూట్యూబ్ భారతదేశ ఆదాయం 2024లో 14,300 కోట్ల రూపాయలు. ఫేస్‌బుక్ (మెటా) టర్నోవర్ కూడా వేల కోట్ల రూపాయలలో ఉంది. దీని అర్థం ఒక కంటెంట్ క్రియేటర్ కోటీశ్వరుడు అయినా.. అసలు డబ్బు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వద్దకే వెళ్తుంది. 

కంటెంట్ క్రియేషన్ ఒత్తిడి

కంటెంట్ క్రియేషన్ కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు.. దీనిలో చాలా పోటీ, మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. తమ ఫాలోవర్ల సంఖ్య లేదా లైక్స్‌తో తమను తాము పోల్చుకుంటారు క్రియేటర్స్. కొన్నిసార్లు కంటెంట్ వైరల్ కాకపోతే క్రియేటర్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. దానికి తగిన ప్లానింగ్, కఠోర శ్రమ కూడా అవసరం.