The Feast of the Seven Fishes : డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2025) పండుగను జరుపుకుంటారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు ఈ పండుగ చేసుకుంటారు. అయితే బైబిల్లో ఎక్కడా డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మించిన ప్రస్తావన లేదు కానీ.. చరిత్రకారుల ప్రకారం యేసుక్రీస్తు జననానికి ముందు ఈ పండుగ జరుపుకోలేదు. గ్రీకు క్యాలెండర్ ప్రకారం, బైబిల్లోని గుర్తుల ఆధారంగా.. క్రిస్మస్ వేడుకను క్రైస్తవులు జరుపుకుంటారు.
క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ నెల ప్రారంభం నుంచే మొదలవుతాయి. షాపింగ్ నుంచి క్రిస్మస్ ట్రీల వరకు అన్ని డెకరేషన్స్ ప్రారంభమవుతాయి. కొన్ని ప్రాంతాల్లో ముందుగానే క్రిస్మస్ జరుపుకుంటారు. నూతన సంవత్సరంతో పాటు క్రిస్మస్ వేడుకలతో డిసెంబర్ నెల చాలా కలర్ ఫుల్గా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగలో వివిధ సంప్రదాయాలు, నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. అలాంటివాటిలో ఏడు చేపల విందు కూడా ఒకటి. దీనిని 'ఫీస్ట్ ఆఫ్ ది సెవెన్ ఫిషెస్' అని పిలుస్తారు. ఈ ట్రెడీషన్ ఏమిటో.. దీనికి క్రిస్మస్తో సంబంధం ఏమిటో చూసేద్దాం.
ఫీస్ట్ ఆఫ్ ది సెవెన్ ఫిషెస్ అంటే ఏమిటి?
క్రిస్మస్ ముందు రోజు.. అంటే డిసెంబర్ 24 రాత్రి.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఇటలీ, ఇటాలియన్-అమెరికన్స్.. ఈ రోజున ఒక ప్రత్యేకమైన సంప్రదాయం పాటిస్తారు. దీనిని ఫీస్ట్ ఆఫ్ ది సెవెన్ ఫిషెస్ (7 చేపల విందు) లేదా ఇటాలియన్ భాషలో 'లా విజిలియా' (La Vigilia) అని అంటారు. చాలామంది దీనిని ఫిష్ డిన్నర్ లేదా విజిల్‌గా కూడా పిలుస్తారు. అయితే 7 చేపల విందు అనేది ఒక సాధారణ పేరు. ఎందుకంటే చాలామంది 3, 11 లేదా 13 లేదా ఏదైనా బేసి సంఖ్యలో మాంసాహార విందును తయారు చేసుకుంటారు.
ఈ సంప్రదాయం ఎప్పుడు, ఎక్కడ మొదలైందంటే..
ఈ సంప్రదాయానికి మూలాలు ఇటలీ దక్షిణ భాగంలో ఉన్నాయని నమ్ముతారు. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయమని చెప్తారు. 1861 ముందు.. ఇటలీ వివిధ ప్రాంతాలుగా విడిపోయింది. ఇందులో దక్షిణ ప్రాంతం చాలా పేదది. ప్రతి ప్రాంతానికి సొంత ప్రభుత్వం కూడా ఉంది. ఆ సమయంలో కొత్త ప్రభుత్వం తన వనరులను ఉత్తర ఇటలీకి కేటాయించినప్పుడు.. దక్షిణ ప్రాంతంలో పేదరికం, నేరాలు పెరిగాయి. కానీ సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో చేపలకు కొరత లేదు.
దాంతో ఇటలీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు క్రిస్మస్ సమయంలో ఈ ట్రెడీషన్ ఫాలో అయ్యేవారు. క్రమంగా ఒకటి కంటే ఎక్కువ రకాల చేపలతో తయారు చేసిన ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేయడం ప్రారంభించారు. దీంతో అక్కడికి విజిట్ చేసేవారి సంఖ్య పెరగడం మొదలైంది. దాదాపు 1900ల సమయంలో ఏడు చేపల పండుగ ప్రారంభమైంది. పేదరికం కారణంగా ఇటాలియన్లు దేశాన్ని విడిచిపెట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్లినప్పుడు.. ఈ సంప్రదాయాన్ని కూడా వారితో పాటు తీసుకెళ్లారు. అందుకే ఏడు చేపల విందు సంప్రదాయం చాలా మంది ఇటాలియన్ అమెరికన్లలో కూడా వ్యాపించింది.
నిరాకరణ: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, సమాచారం ఆధారంగా మాత్రమే ఉంది. ABP దేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడమే మా ఉద్దేశం. ఏదైనా సమాచారం లేదా ట్రెడీషన్ ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.