Freedom of Speech vs Body Shaming : ఒకరి ఎత్తు, బరువు, సన్నబడటం, రంగు లేదా శారీరక రూపాన్ని గురించి వ్యాఖ్యానించడం, ఇతరుల ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా గ్రాంటెడ్​గా తీసుకుని హేళన చేయడం చాలా కామన్ అయిపోయింది. కానీ మీకు తెలుసా? ఎవరినైనా పొట్టి అని పిలవడం, లావు, నల్లగా అనే దానిని బట్టి నిక్​ నేమ్ పెట్టి పిలవడం లేదా ఎగతాళి చేయడం నేరం. ఇవి శిక్షార్హమైనవి కూడా.

Continues below advertisement

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం.. అందరు భారతీయులు భావ ప్రకటనా అనే స్వేచ్ఛను పొందుతున్నారు. అయితే దీని అర్థం ప్రతి వ్యక్తిపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చని కాదు. తమ ఆలోచనలను వ్యక్తపరచవచ్చు. స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. కానీ ఈ స్వేచ్ఛ కొన్ని నియమాలు, నిబంధనలకు లోబడి ఉంటుంది.

బాడీషేమింగ్​లోకి వచ్చే అంశాలివే

నిజానికి వాక్ స్వాతంత్ర్యం అనే పేరుతో చాలామంది ఈ హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. జోకులు, వ్యంగ్యం లేదా వాక్ స్వేచ్ఛ పేరుతో.. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విషయాలు మాట్లాడుతున్నారు. అలాంటి వాటిలో బాడీ షేమింగ్ ప్రధానంగా ఉంటుంది. ఇతరుల ఎత్తు, బరువు, రంగు, రూపు గురించి వ్యాఖ్యానించడం.. వారిని ఎగతాళిగా పిలవడం, అవమానించడం వంటివి బాడీ షేమింగ్ పరిధిలోకి వస్తాయి.

Continues below advertisement

చాలామంది ఇలా పిలవడం జోక్ లేదా జోవియల్​ అనుకుంటారు. కానీ అలాంటి వ్యాఖ్యలకు గురైన వ్యక్తిలో అది మానసిక ఒత్తిడి, ఇబ్బందిని పెంచి.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దీంతో వాళ్లు నిరాశలోకి వెళ్లిపోతారు. కాబట్టి అలా పిలిచిన వారిపై కంప్లైంట్ ఇస్తే ఎలాంటి శిక్ష విధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

బాడీ షేమింగ్​పై ప్రత్యేక చట్టం ఉందా?

ప్రస్తుతం ఇండియాలో బాడీ షేమింగ్ పేరుతో ప్రత్యేక, ప్రత్యక్ష చట్టం ఏదీ లేదు. అంటే.. భారతీయ చట్టంలో బాడీ షేమింగ్ నేరం అని స్పష్టంగా రాసిన పదం లేదా విభాగం లేదు. కానీ దీని అర్థం ఏ వ్యక్తిని అయినా అతని బాడీషేమింగ్ చేసి అవమానించవచ్చని కాదు. శిక్షలేదని కాదు. 

ఎలాంటి శిక్ష విధించవచ్చంటే?

ఎవరైనా ఒకరి శారీరక రూపాన్ని పదే పదే అవమానించినా, ఎగతాళి చేసినా.. అది పరువు నష్టంగా పరిగణిస్తారు. పరువు నష్టం అంటే ఒక వ్యక్తి సామాజిక ప్రతిష్ట, గౌరవం లేదా ప్రతిష్టకు హాని కలిగించడం. అలాంటి సందర్భాలలో బాధితుడు భారతీయ శిక్షాస్మృతి కింద కేసు నమోదు చేయవచ్చు. దోషిగా తేలితే నిందితుడికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. 

చట్టం ఏం చెబుతుందంటే..

భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఒకరి మనోభావాలను గాయపరచాలని కాదు. పొట్టిగా ఉండటం, అధిక బరువు ఉండటం లేదా ఇతరత్రా శారీరక రూపాన్ని బట్టి ఒకరిని అవమానించడం తప్పు మాత్రమే కాదు, చట్టపరమైన ఇబ్బందులకు కూడా దారితీస్తుంది. కాబట్టి మీ మాటలు ఒకరి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి.. మాట్లాడే ముందు ఆలోచించడం ముఖ్యం.