చాలామందికి బాత్ రూమ్ కి ఫోన్ కూడా తీసుకుని వెళ్ళే అలవాటు ఉంటుంది. కమోడ్ మీద కూర్చుని ఫోన్ స్క్రోల్ చేస్తూ ఏదో ఒక వీడియోలు చూస్తూ గంటలు గంటలు టైమ్ పాస్ చేసేస్తారు. కానీ ఈ పని మీకు కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మల విసర్జనకి వెళ్ళినప్పుడు ఫోన్ చూస్తూ ఉండటం వల్ల ఎటువంటి అనార్థాలు జరుగుతాయని తెలియజేస్తూ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. అలా చేయడం వల్ల పురీష నాళం, పాయువుపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆయన వెల్లడించారు. ఇది హేమరాయిడ్స్(పైల్స్), మలబద్ధకం వంటి సమస్యలకు దారి తీస్తుంది.


ఎన్ హెచ్ ఎస్ ప్రకారం ఇవి ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే ఇబ్బంది పెట్టేస్తాయి. మలద్వారం దగ్గర రక్తనాళాలు పెరిగి గడ్డలు ఏర్పరుస్తాయి. అవే పైల్స్ లేదా హేమరాయిడ్స్ అని పిలుస్తారు. మలవిసర్జన చేసే సమయంలో తీవ్ర అసౌకర్యాన్ని బాధని కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో నొప్పి, దురద, వాపు ఉంటుంది. దీన్ని తగ్గించుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. పైల్స్ కారణంగా ఒక్కోసారి రక్తస్రావం అవుతుంది. నిపుణుల హెచ్చరికల ప్రకారం ఎక్కువ సేపు లూపై కూర్చోవడం వల్ల కలిగే అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్య ప్రొలాప్స్. పురీషనాళం పాయువు లోపలకి జారిపోయినప్పుడు ఇది సంభవిస్తుంది. ఫోన్‌ని మీతో పాటు బాత్ రూమ్ కి తీసుకుని వెళ్లకపోవడం మంచిది. ఇది మాత్రమే కాదు టాయిలెట్ సీటు.. బ్యాక్టీరియా సంతానోత్పత్తి ప్రదేశం.


స్మార్ట్ ఫోన్ మీద పబ్లిక్ టాయిలెట్ సీటు కంటే ఎక్కువ మురికిగా ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నార్డ్‌వీపీఎన్ అధ్యయనం ప్రకారం 10 మందిలో ఆరు మంది తమ ఫోన్‌ను వాష్‌రూమ్‌కు తీసుకువెళతారు. వీరిలో ముఖ్యంగా యువత ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 61.6% మంది టాయిలెట్ సీటుపై కూర్చొని ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తునట్లు అంగీకరించారు. తమ జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలను, దాని పరిష్కారాన్ని టాయిలెట్ సీటుపైన కూర్చునే ఆలోచిస్తూ ఉంటామని మరికొందరు చెప్తున్నారు. మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే టాయిలెట్ సీట్ల కంటే 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా మన స్మార్ట్‌ఫోన్‌లపై కనిపిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే వీటిని అక్కడ కూర్చున్నప్పుడు మీ వెంట తీసుకుని వెళ్లకపోవడమే మంచిది. కొంతమంది ఈ అలవాటు మార్చుకుందామని అనుకుంటారు కానీ సాధ్యపడదు. తప్పని పరిస్థితిలో తీసుకుని వెళ్లాల్సి వస్తే మాత్రం బాత్ రూమ్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఫోన్ ను శానిటైజ్ చేసుకోవడం అసలు మరచిపోవద్దు.


పైల్స్ లక్షణాలు


☀ మల విసర్జన సమయంలో రక్తస్రావం


☀ పాయువు చుట్టూ నొప్పి


☀ పాయువు వాపు, దురద


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి