కొంతమందికి పడుకోగానే నిద్రపట్టేస్తుంది. కానీ మరికొంతమంది మాత్రం నిద్రలోకి జారుకోవడానికి గంటల కొద్దీ పాట్లు పడతారు. అటువంటి వాళ్ళు నిద్ర పట్టడం లేదని స్లీపింగ్ పిల్స్ కి అలవాటు పడతారు. అతిగా నిద్ర మాత్రలను మింగడమంటే.. మన గొయ్యిని మనం తీసుకున్నట్లే. అంటే మన ఆరోగ్యాన్ని మన చేతులారా చెడగొట్టుకున్నట్లే. అది ఏయే సైడ్ ఎఫెక్ట్‌లకు దారి తీస్తుందనేది మీరు కల్లో కూడా ఊహించుకోలేరు. నిద్ర ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఇలా పిల్స్ ద్వారా పట్టే బలవంత నిద్ర మాత్రం మంచిది కాదు. ప్రశాంత నిద్ర కోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి పాటిస్తే.. మంచి నిద్ర, ఆయుష్షు, ఆరోగ్యం లభిస్తాయి. అవేంటో చూసేయండి.


ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. దానికి అంతరాయం ఏర్పడితే స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అధిక ఒత్తిడి కారణంగా నిద్ర కరువై నిద్రమాత్రల మీద ఆధారపడతారు. ఎప్పుడో ఒకసారి వేసుకుంటే సరిపోతుంది కానీ అదే పనిగా వీటిని వాడితే మాత్రం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.


ResMed అనే స్లీప్ సర్వే 2023 ప్రకారం 58 శాతం మంది భారతీయలు గురక మంచి నిద్రకు సంకేతంగా భావిస్తున్నారు. కానీ ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA), ఇతర నిద్ర సంబంధిత సమస్యల లక్షణం అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ వ్యాధి వల్ల పగటి నిద్రకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 97 శాతం మంది భారతీయులు నిద్ర సమస్యలకు చికిత్స పొందుతున్నప్పుడు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని పరిశోధన వెల్లడించింది.


నిద్రకు అనుకూలమైన వాతావరణం కావాలి


నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుచుకుంటే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికార్లు లేదా స్క్రీన్ లను ఉపయోగించడం వల్ల నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. వీటి నుంచి వెలువడే నీలి కాంట్ర నిద్ర-మేల్కోనే చక్రాన్ని నియంత్రించే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. అందుకే పడుకునే ముందు వాటిని చూడొద్దు. గది కూడా లైట్లు లేకుండా డిమ్ చేసుకోవాలి. గోరు వచ్చని నీటితో స్నానానం చేయడం, పుస్తకాన్ని చదవడం, ధ్యానం చేయడం వంటి పద్ధతులు హాయి గా నిద్రపట్టేలా చేస్తాయి.


స్లీప్ షెడ్యూల్ కి కట్టుబడి ఉండాలి


నిద్ర చక్రం సిర్కాడియన్ రిథమ్‌ సమతుల్యంగా ఉంచేలా చూసుకోవాలి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, మేల్కోవాదం అలవాటు చేసుకోవాలి. మంచి నిద్ర ఆరోగ్యాన్ని ఇస్తుంది.


వర్క్ లైఫ్ బ్యాలెన్స్


తగినంత నిద్ర లేనప్పుడు శరీరంలోని ప్రక్రియలు ఉత్తమంగా పని చెయ్యవు. పని ఒత్తిడి వల్ల చాలా మందికి నిద్ర ఉండదు. నిద్రలేమితో పని చేస్తే అది పనితీరు మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంత పని ఉన్నప్పటికీ సరైన టైమ్ కి నిద్రపోతే అటు ఉద్యోగం సరిగా చేసుకోవచ్చు, సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చు.


వ్యాయామం


మెదడుని రిలాక్స్ మోడ్ లోకి తీసుకెళ్లేందుకు ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటివి ఫాలో అవ్వచ్చు. శారీరక శ్రమ ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెండు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్ఫీన్ల ఉత్పత్తిని పెంచుతుంది. విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. అయితే నిద్రపోయే ముందు వ్యాయామం చేయకూడదు. కొన్ని గంటల ముందు మాత్రమే చేయాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మీరు వాడే వంట నూనె గుండెకు మంచిదేనా? బెస్ట్ కుకింగ్ ఆయిల్ గురించి ఇలా తెలుసుకోండి