Android Earthquake Alert System : ప్రపంచంలో ఏదొక చోట భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. చాలామంది భూకంపాలకు గురయ్యే ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఆ సమయంలో భూకంపాల తీవ్రతను బట్టి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగానే అవుతుంది. అయితే ఈ ఎర్త్​ క్వేక్​ల గురించిన ముందస్తు హెచ్చరికలు ఉంటే నష్టాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. అదే ఉద్దేశంతో గూగుల్ ఆండ్రాయిడ్ ఓ ఫీచర్​ని అందుబాటులోకి తెచ్చింది. భూకంపాల సమయంలో మొబైల్​కు అలెర్ట్​నిచ్చి.. ఎలాంటి భద్రతలు తీసుకోవాలో చెప్తుంది. ఇంతకీ అది ఎలా పని చేస్తుంది? దానిని ఎలా యాక్టివ్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 

భూకంపం గురించి ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం తగ్గుతుందని చెప్తున్నారు నిపుణులు. దానిలో భాగంగానే.. గూగుల్ సకాలంలో, సహాయకరమైన భూకంప సమాచారాన్ని అందించే విధంగా.. ఆండ్రాయిడ్ యూజర్స్​ని అలెర్ట్ చేస్తుంది. దీని ద్వారా తమని తాము లేదా.. తమకి ఇష్టమైన వారిని సురక్షితంగా ఉంచగలిగే అవకాశముంది. 

ShakeAlert నుంచి సమాచారం సేకరించి..

గూగుల్ ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ(Google's Android Earthquake Alert System).. ప్రపంచవ్యాప్తంగా వచ్చే భూకంపాలను గుర్తిస్తుంది. భూ ప్రకంపనలు ప్రారంభమయ్యే ముందే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అలెర్ట్ పంపిస్తుంది. ShakeAlertతో భాగస్వామ్యం చేసుకుని.. వారి సిస్టమ్ అందించే హెచ్చరికలను ఇది యూజర్స్​కి పంపిస్తుంది. ఈ ShakeAlert భూకంప ప్రకంపనలను గుర్తించడానికి 1675 భూకంప సెన్సార్ల నెట్​వర్క్​ను ఉపయోగిస్తుందట. దాని ద్వారా  వచ్చిన డేటాతో భూకంప స్థానం, పరిమాణాన్ని విశ్లేషిస్తుందట. దానిలో వచ్చిన రిజల్ట్​ను ShakeAlert తన సిస్టమ్ నుంచి Android Earthquake Alerts Systemకి ఒక సిగ్నల్‌ను పంపుతుంది. దీనివల్ల Android వినియోగదారులకు నేరుగా భూకంప అలెర్ట్ వస్తుంది. 

రెండు బిలియన్లకు పైగా ఫోన్లు వాడకడం

దాదాపు అన్ని స్మార్ట్​ఫోన్​లలో కంపనాలను గ్రహించగల చిన్న యాక్సిలెరోమీటర్లు ఉంటాయట. ఇవి భూకంపం సంభవించడాన్ని సూచించగలవని తెలిపారు. అలా గుర్తిస్తే భూకంప గుర్తింపు సర్వర్​కు ఓ సంకేతం వెళ్తుంది. అది ప్రకంపన ఎక్కడ ఉందో చూపిస్తుంది. అక్కడ ఎర్త్​క్వేక్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి సర్వర్ అనేక ఫోన్​ల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న రెండు బిలియన్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్​లను మినీ-సీస్మోమీటర్​లుగా ఉపయోగించి సమాచారాన్ని అలెర్ట్​ రూపంలో పంపిస్తుందట. భూకంప తీవ్రత, వేగం అన్ని తెలుసుకుని ప్రభావిత ప్రాంతాల్లోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు పంపిస్తుంది. 

సెట్టింగ్​ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే.. 

ముందుగా మీ Android ఫోన్​ని ఓపెన్ చేయాలి. దానిలో Settings Safety & emergency సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. దానిలో Earthquake Alerts Turn on చేయాలి అంతే. అయితే మీరు అలెర్ట్​ని పొందాలంటే.. WI-FI లేదా Data ఆన్​లో ఉండాలి. అలాగే ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్స్​కి మాత్రమే అందుబాటులో ఉంది. 

భూకంప గురించి యూజర్స్​ని అప్రమత్తం చేయడానికి ఆండ్రాయిడ్​లో రెండు రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి. Be Aware, Take Action అనే రెండు రకాల అలెర్ట్స్ వస్తాయి. 4.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలకు మాత్రమే ఈ అలెర్ట్ వస్తాయి. మీకు వచ్చిన నోటిఫికేషన్​ని నొక్కితే మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది. అలాంటి అలెర్ట్ వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఈ సెట్టింగ్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు మొబైల్​ని ఉపయోగించకపోయినా భూకంపం వచ్చే ముందు పెద్ద సౌండ్​తో స్క్రీన్ ఆన్ చేసి అలెర్ట్ వస్తుంది.