Indians Food Expenditure | భారతదేశం ఏం తింటోంది? అనే విషయం గురించి సర్వే చేసినపుడు ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగుచూశాయని చెప్పవచ్చు. మొత్తం ఇంటి ఖర్చులో ఆహారం కోసం చేసే వ్యయం ఇది వరకటితో పోలిస్తే 50 శాతం వరకు తగ్గిపోయిందట. మొత్తం నెల వారీ వ్యయంలో సగం కంటే తక్కువే ఆహారం కోసం ఖర్చు చేస్తున్నారట. తృణధాన్యాలు, కూరగాయల వినియోగం బాగా తగ్గిందట. కానీ పండ్లు, పాలు, పాలు, పాల ఉత్పత్తులు, గడ్లు, ఇతర మాంసాహారాల వినియోగం పెరిగింది. నిజానికి ప్యాక్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం గణనీయంగా పెరిగిందట. తృణధాన్యాలు, కూరగాయల నుంచి భారతీయ కుటుంబాలు మాంసాహారం, ప్యాక్డ్ ఆహారాల వైపు భారీగా మళ్లినట్టు గుర్తించారు.


షమిక రవి, ముదిత్ కపూర్, డాక్టర్ శంకర్ రంజన్, డాక్టర్ గౌరవ్ ధమిజా, డాక్టర్ నేహా సరీన్ ల ఆర్థికవేత్తల బృందం ఈ గృహవినియోగ సర్వే నిర్వహించింది. భారతీయ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆహార వినియోగ విధానాలను అధ్యయనం చేశారు.


ఆహార వినియోగ వ్యయం ఎంత తగ్గింది?


గ్రామీణ ప్రాంతాల్లో గృహ వ్యయాల్లో ఆహార వ్యయం వాటా 2011-12లో 55.7% ఉండగా, 2022-23లో ఇది 48.6%కి తగ్గింది. ఈ తగ్గుదల వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భిన్నంగా కనిపించింది. ఉదాహరణకు, తమిళనాడులో ఇది 55.4% నుండి 44.2%కి, అంటే 10.2 శాతం పాయింట్లు తగ్గింది, అలాగే పంజాబ్‌లో 4.2 శాతం పాయింట్లు తగ్గి 48.3% నుండి 44.1%కి వచ్చింది.


పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ తగ్గుదల కనిపించింది, 48% నుండి 41.9%కి పడిపోయింది. ఉత్తరాది ప్రాంతాల్లో ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 9.6 శాతం పాయింట్లు తగ్గుదల 49.1% నుండి 39.5%కి జరిగింది. మేఘాలయలో స్వల్పంగా 43.4% నుండి 42.5%కి, అంటే 0.9 శాతం పాయింట్లు మాత్రమే తగ్గింది.


గ్రామీణ ప్రాంతాలలో 20 శాతం కుటుంబాల ఆహార వ్యయాల్లో సగటు వాటా 59.6% నుండి 52.1%కి, అంటే 6.5 శాతం పాయింట్లు తగ్గినట్లు గుర్తించారు. అలాగే, పట్టణ ప్రాంతాలలో 20 శాతం కుటుంబాలు కూడా వారి ఆహార వ్యయం 56.9% నుండి 48.9%కి తగ్గించుకున్నారట.


గ్రామీణ ప్రాంతాల్లో పండ్ల కంటే పాన్, పొగాకు, మద్యం వంటి వ్యసనాలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.


సగటున, ఇళ్లలో  ధాన్యాల వాడకం గణనీయంగా తగ్గింది, అలాగే కూరగాయల వ్యయం కూడా కొంత తగ్గింది. అయితే, పాలు, పాల ఉత్పత్తులు, తాజా పండ్లు, గుడ్లు, చేపలు, మాంసం వంటి వస్తువులపై వ్యయం పెరిగింది, అంటే ఈ వస్తువుల వినియోగం పెరిగినట్లు సూచిస్తోంది.


విషాదం ఏంటంటే పాన్, పొగాకు, మత్తుపదార్థాలపై వ్యయం 2.7% నుండి 3.2%కి పెరిగింది. గ్రామీణ గృహాలు పండ్ల కంటే వీటి పై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. వీరు పానీయాలు, ప్యాకేజ్డ్ మరియు ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌పై కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.


గ్రామీణ, పట్టణ గృహాల్లో టాప్ 20% మరియు బాటమ్ 20% మధ్య గల వ్యత్యాసంలో కూడా తగ్గుదల కనిపిస్తోంది.


గ్రామీణ గృహాలలో గుడ్లు, చేపలు, మాంసం వంటి వాటి వినియోగం 64.4% నుండి 80.2%కి పెరిగింది, బాటమ్ 20% లో 58.3% నుండి 78.5%కి, సుమారు 20 శాతం పాయింట్ల మేరకు గణనీయమైన పెరుగుదల కనిపించింది. పట్టణ గృహాల విషయంలో కూడా ఇదే విధమైన ధోరణి కనిపించింది, అంటే టాప్ 20% మరియు బాటమ్ 20% మధ్య వ్యత్యాసం తగ్గింది. సగటున ఒకవ్యక్తి గుడ్లు, చేపలు, మాంసం వినియోగం 2011-12 నుండి 2022-23 లో 0.7 కిలోల నుండి 1.1 కిలోల వరకు పెరిగింది, ఇది సుమారు 57% వృద్ధిని సూచిస్తుంది.