కిడ్నీలో రాళ్లు చేరడం అనేది ఇప్పుడు అధికమైపోయింది. ముఖ్యంగా సరైన మోతాదులో నీళ్లు తాగక పోవడం వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే ఒక రోగి కిడ్నీ నుంచి ఏకంగా 154 రాళ్ళను తొలగించారు. ఇన్ని రాళ్లు కిడ్నీలో పేరుకుపోవడం అనేది వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇది ఎక్కడో కాదు హైదరాబాదులోనే జరిగింది. ఆ రోగి రామగుండానికి చెందిన వ్యక్తి. ఎండోస్కోపీ ద్వారా కిడ్నీలో రాళ్లు ఉన్న సంగతి తెలిసింది. అవి కరిగే స్థాయిని దాటి పోయాయి. కచ్చితంగా శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి. ఇందుకోసం రోగిని ఆపరేషన్ కి సిద్ధం చేశారు. రాళ్లను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కిడ్నీ నిండా రాళ్లు నిండి పోయాయి. 154 రాళ్లలో ఒక రాయి పెద్దగా ఉంది, మిగతా 153 రాళ్లు చిన్న ఉన్నాయి. పెద్ద రాయిని పగుల గొట్టి చిన్న ముక్కలుగా చేశారు. అత్యంత సంక్షిష్టమైన ప్రక్రియ ద్వారా వాటిని తొలగించారు.
కిడ్నీలో రాళ్లు ఉంటే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
1. మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో నొప్పి వస్తుంది.
2. ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చే అవకాశం ఉంది.
3. మూత్రం రంగు పింక్, ఎరుపు, గోధుమ రంగులో ఉంటుంది.
4. పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.
5. పక్కటెముకల కింద, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
6. మూత్రవిసర్జన చిన్న మొత్తంలో వెళ్లాల్సి వస్తుంది.
రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. నీళ్లు సరిగా తాగకపోయినా రాళ్లు ఏర్పడతాయి. కుటుంబ చరిత్రలో ఎవరికైనా రాళ్ల సమస్యా ఉన్నా కూడా వారసత్వం పిల్లలకు, మనువలకు వచ్చే అవకాశం ఉంది. ప్రొటీన్, సోడియం, చక్కెర వంటి ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు చేరిపోవచ్చు. ఊబకాయం బారిన పడిన వారిలో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు. కొన్ని వైద్యు పరిస్థితులు అంటే రోగాల వల్ల కూడా రాళ్లు ఏర్పడే ఛాన్సులు ఉన్నాయి.
ఎలా నిర్ధారిస్తారు?
కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు ముందుగా రక్త పరీక్ష చేస్తారు. రక్తంలో ఎక్కువ కాల్షియం, లేదా యూరిక్ యాసిడ్ ఉంటే రాళ్లు చేరినట్టు అనుమానిస్తారు. తరువత మూత్ర పరీక్షను నిర్వహిస్తారు. రెండు మూడు రోజుల పాటూ మూత్ర పరీక్ష చేస్తారు. ఇమేజింగ్ టెస్టు చేస్తారు. ఇందులో రాళ్లు సైజును తెలుసుకుంటారు. చిన్న రాళ్లను మందుల ద్వారా కరిగిస్తారు. కరిగించే స్థాయిని దాటి రాళ్ల పరిమాణం ఉంటే వాటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు.
Also read: పుచ్చకాయతో పాటు వీటిని తింటే విరేచనాలు, ఉబ్బరం రావడం ఖాయం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.