Civil Services Prelims 2024 Examnation: దేశంలోని అత్యున్నత సర్వీసుల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 'యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్', 'ఫారెస్ట్ సర్వీసెస్' ప్రిలిమినరీ పరీక్షను యూపీఎస్సీ దేశవ్యాప్తంగా 80 నగరాల్లో జూన్ 16న నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాల ఈసారి కూడా భారీగానే అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. దాదాపు లక్ష వరకు అభ్యర్థులు సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. వీరికోసం హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్‌ పరీక్షలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. పరీక్ష కేంద్రాల వద్ద పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లను మూసివేయాలని యూపీఎస్సీ కొత్త నిబంధన విధించిన సంగతి తెలిసిందే. అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, జామర్లను బిగించారు. ఇక ‘నో ఐడీ... నో ఎంట్రీ’ విధానంలో భాగంగా హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డు లేని వారిని లోనికి అనుమతించబోరు. 


ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 16న రెండు సెషన్లుగా పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందువరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోని అభ్యర్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లను మూసివేస్తారు. అంటే ఉదయం 9 గంటల వరకు మాత్రేమ అనుమతిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. హాల్‌టికెట్‌లో ఫోటో సరిగాలేనివారు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో (ఆధార్, పాన్‌కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు) పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.


ప్రిలిమ్స్ అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..


సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి గాను మొత్తం 1056 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తింజేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.  


ప్రిలిమ్స్ పరీక్ష విధానం..
మొత్తం 400 మార్కులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. 


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


★ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందుగానే గేట్లను మూసివేస్తారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రంలోని అనుమతించరు. కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. 


★ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ తీసుకెళ్లాలి. లేకపోతే అనుమతించరు. హాల్‌టికెట్‌‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.


★ OMR షీట్‌ను కేవలం బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతో మాత్రమే నింపాలి.


★ పరీక్ష కేంద్రంలోని మొబైల్ ఫోన్లు, పేజర్లు, ప్రోగ్రామబుల్ డివైజ్‌లను, పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచీలు, కెమెరా, బ్లూటూత్ డివైజ్‌లతోపాటు మరే ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతించరు.


యూపీఎస్సీ నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...