TSPSC New Exam Dates Latest News:

  తెలంగాణలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఇప్పటికే పలు పరీక్షలు రద్దు చేసింది టీఎస్ పీఎస్సీ. కొన్ని పరీక్షలను ముందుగానే రద్దు చేసింది కమిషన్. తాజాగా మరికొన్ని పరీక్షలను రీ షెడ్యూల్ చేసింది టీఎస్ పీఎస్సీ. 5 నియామక పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. అగ్రికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్, డ్రగ్స్ ఇన్ స్పెక్టర్, వాటర్ డిపార్ట్ మెంట్ లోని గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ పోస్టులు వంటి మొత్తం 5 పోటీ పరీక్షల తేదీలను కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.  అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు మొదట ఏప్రిల్ 23న పరీక్ష తేదీని ప్రకటించగా, తాజాగా జూన్ 26కు ఎగ్జామ్ వాయిదా వేశారు.



  • మే 16 అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్

  • మే 19 డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ ఎగ్జామ్

  • జూన్ 26 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఎగ్జామ్

  • జులై 18, 19 తేదీలలో వాటర్ బోర్డులో గెజిటెడ్ పోస్టులకు పరీక్షలు

  • జులై 20, జులై 21 తేదీలలో వాటర్ బోర్డులో నాన్ గెజిటెడ్ పోస్టులకు పరీక్షలు


పాత షెడ్యూల్ ప్రకారం ఏవీఎంఐ ఎగ్జామ్  తేదీ  ఏప్రిల్ 23 అని ప్రకటించారు. తాజాగా ఈ పరీక్షను జూన్ 26కు వాయిదా వేసింది టీఎస్ పీఎస్సీ. పేపర్ల లీకేజీ కలకలం, ఇంకా ఏమైనా ఎగ్జామ్ పేపర్లు లీకయ్యాయా అనే అనుమానంతో పరీక్షలను రీషెడ్యూల్ చేస్తోంది కమిషన్. కొత్తగా పేపర్లు తయారుచేసి రీ షెడ్యూల్ చేసిన తేదీలలో ఈ 5 నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 25న ఉండాల్సిన పరీక్షను మే 16కు రీషెడ్యూల్ చేశారు. మే 19న డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ ఎగ్జామ్ నిర్వహించనుండగా.. వాటర్ బోర్డులో ఉద్యోగాలకు నిర్వహించే ఎగ్జామ్స్ తేదీలను సైతం కమిషన్ ప్రకటించింది. మే 15, 16న నిర్వహించాల్సిన వాటర్ బోర్డులో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను జులై 20, జులై 21 తేదీలకు రీషెడ్యూల్ చేశారు. ఇందులోనే గెజిటెడ్ ఉద్యోగాలకు జులై 18, 19 తేదీలలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని, అభ్యర్థులు ఈ విషయాలు గమనించాలని సూచించారు.


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డికి కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా తెలిసింది? అనేది చిక్కుముడిగా మారింది. మార్చి 11న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంతవరకు 18 మంది నిందితులను గుర్తించి.. 17 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు సాధించిన రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉన్నట్లు సిట్ పోలీసులు గుర్తించారు. అతనికి వాట్సప్ ద్వారా నోటీసులు జారీచేశారు. దీనిపై స్పందించిన అతను గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం తనకు అందలేదంటూ సిట్ అధికారులకు వాట్సప్ ద్వారా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల కోసం కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ డైరీలో రాసిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించినట్లు నిందితులు పోలీసుల దర్యాప్తు, సిట్ కస్టడీలోనూ ఒకేవిధంగా సమాధానమిచ్చారు.