తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీతో వాయిదాపడిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మే 19న ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 8న టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష; జులై 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ పేర్కొంది.


తెలంగాణ మున్సిపల్ శాఖలో 175  టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 7న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మొదట జనవరిలోనే రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కుదరకపోవడంతో మార్చి 12న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అయితే పేపరు లీక్ కారణంగా పరీక్షను వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా పరీక్ష నిర్వహణ తేదీని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.32,810 - రూ.96,890 జీతంగా ఇస్తారు.


పరీక్ష విధానం: 
మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రెండు విభాగాల నుంచి 300 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, అభ్యర్థి సంబంధిత సబ్జెక్ట్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు. 


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో క్లాస్-ఎ విభాగంలో 170 పోస్టులు, క్లాస్-బి విభాగంలో 15 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 – రూ.1,33,630  జీతంగా ఇస్తారు.


పరీక్ష విధానం: 
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (వెటర్నరీ సైన్స్-డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నలకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.



Also Read:


APPSC: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు ఖరారు, ఎప్పుడంటే?
ఏపీలో వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్‌-1 సర్వీసు(నోటిఫికేషన్ నెం. 28/2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఖరారుచేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్‌ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు మే 19న ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని పాతజిల్లాల ప్రధాన కేంద్రాల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు మే 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు నిర్దేశించిన తేదీలో హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, అందులో పేర్కొన్న సూచనలను అనుసరించాలని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...