తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం కష్టపడి చదివిన నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. రాత్రింభవళ్లు చదివి.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించివారైతే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎవరో చేసిన పాపం, తమకు శాపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలాగైనా సర్కారు కొలువు కొట్టి కుటుంబానికి అండగా నిలబడాలని భావించే వారి వ్యతలు చెప్పుకోలేనివి. భద్రాచలానికి చెందిన భవానీది ఇదే పరిస్థితి. చిన్ననాటి నుంచే దివ్యాంగురాలైన భవాని సరిగా మాట్లాడలేదు, చెవులు కూడా సరిగా వినపడవు. అయినప్పటికీ కష్టపడి చదివి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసింది, మెయిన్స్‌కు అర్హత కూడా సాధించింది. తీరా గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించడంతో వారి కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.
కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శాంతినగర్ కాలనీకి చెందిన మల్లయ్య తిరుపతమ్మకు ఇద్దరు కుమార్తెలు. చిన్ననాటి నుంచే దివ్యాంగురాలైన చిన్న కూతురు భవానీకి పుట్టుకతోనే చెవులు సరిగా వినబడవు.. దాంతో మాటలు కూడా సరిగా రావు. ఈ వైకల్యం కారణంగా బాల్యం నుంచి అనేక అవమానాలు ఎదుర్కొంది. ఎంతో కుంగిపోయింది. అయితే తల్లి ఆమెకు ధైర్యం చెప్పింది. ఈ రోజు నిన్ను చూసి నవ్విన వాళ్లే.. రేపు నీ ముందు తల దించుకునేలా జీవితంలో.. ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటూ ప్రొత్సాహించింది. తల్లి చూపిన ప్రేమ, ఇచ్చిన మద్దతుతో ఆ యువతి.. అవమానాలను పట్టించుకోకుండా జీవితంలో ముందుకు వెళ్లింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సరే.. చదువే తన భవిష్యత్తుకు బలమైన ఆధారం అని నమ్మింది. అవమానాలను పట్టించుకోకుండా.. కష్టాలను దాటుకుని.. బాగా చదువుకుని తన తల్లి మాటలను నిజం చేయాలనుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి పాసైంది. తీరా గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఉండడానికి కనీసం ఇల్లు సైతం లేదని.. మళ్లీ పరీక్ష రాసే స్థోమత తమకి లేదని ప్రభుత్వం, లేదా దాతలెవరైనా స్పందించి ఆదుకోవాలని తల్లి తిరుపతమ్మ కోరుతున్నారు.
నగలు, పొలం తాకట్టు పెట్టి మరీ ప్రశ్నాపత్రాల కొనుగోలు..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్ కొనేందుకు ఒక్కొక్కరు ఎంతదూరమైన వెళ్లేందుకు వెనుకాడలేదని తెలుస్తోంది. ఇళ్లు, నగలు, పొలాలు ఇలా దేన్నైనా తాకట్టు పెట్టి మరీ పరీక్ష పేపర్ కొనేందుకు ముందుకు వచ్చారని దర్యాప్తులో తేలుతోంది. ఈ విషయాలు చూసి పోలిసులే విస్తుపోతున్నారు. లీక్ అయిన ప్రశ్నాపత్రాలు అందుకునేందుకు లక్షల్లో ఖర్చు పెట్టాల్సి రావడంతో అభ్యర్థులు వారి నగలు, పొలాలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు చెల్లించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. రేణుక, డాక్యానాయక్ దంపతులు ప్రవీణ్ కుమార్ కు రెండు దఫాల్లో రూ.10 లక్షలు చెల్లించి అసిస్టెంట్ ఇంజినీర్ పేపర్ ను కొనుగోలు చేసినట్లు తేలింది. వాటిని కె.నీలేష్ నాయక్, పి.గోపాల్ నాయక్ లకు రాజేశ్వర్ నాయక్ అనే బ్రోకర్ ద్వారా డాక్యానాయక్ రూ.13.50 లక్షలకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. తిరుపతయ్య అనే మరో బ్రోకర్ ద్వారా రాజేందర్ కుమార్ కు రూ. 5 లక్షలకు అమ్మాడని తేలింది. ప్రశాంత్ రెడ్డి నుండి రూ.7.50 లక్షలు వసూలు చేశాడని అధికారులు గుర్తించారు. వారిలో నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, రాజేందర్ కుమార్ లు డబ్బులు సమకూర్చుకునేందకు పంట పొలాలను తనఖా పెట్టి మరీ డబ్బులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.
మరో 11 మందికి ఏఈ ప్రశ్నాపత్రాలు..
నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ లకు మేడ్చల్ ఠాణాలో కానిస్టేబుల్ గా పని చేసిన శ్రీనివాస్ రూ. లక్ష ఇచ్చినట్లు గుర్తించారు. ప్రశాంత్ రెడ్డి కూడా నగలు తాకట్టు పెట్టి కొంత, అప్పు తెచ్చి ఇంకొంత మొత్తం కలిపి రూ.7.50 లక్షలు ఇచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నలుగురికే కాకుండా మరో 11 మందికి ఏఈ ప్రశ్నాపత్రాలు చేరినట్టు సిట్ పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రశ్నాపత్రాల విక్రయాల్లో కీలకంగా వ్యవహరించిన మరో ఐదుగురి కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. వారంతా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారని ఇప్పటికే అధికారులు గుర్తించినట్లు సమాచారం.
Also Read:
ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
తెలంగాణలో పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 29న ప్రకటించింది. కొత్త షెడ్యూలు ప్రకారం మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలకు; మే 9న అగ్రికల్చర్, మెకానికల్ విభాగాలకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించిననున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..