తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ నియామక పరీక్షల కొత్త షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే షెడ్యూలు చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీని రద్దు చేసిన రోజునే పునఃపరీక్ష తేదీని కమిషన్ వెల్లడించింది. అయితే... గ్రూప్-1తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ, వివిధ పోటీ పరీక్షల షెడ్యూలును పరిశీలించి, టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు మధ్య వ్యవధిని పరిశీలించి, ఆ మేరకు నిర్ణయాలు తీసుకోనున్నారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలే..!
➥ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్న నోటిఫికేషన్ల రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహిస్తోంది. లీకేజీ నేపథ్యంలో మరింత భద్రతతోపాటు ఫలితాలను వేగంగా వెల్లడించేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందనేది కమిషన్ భావన.
➥ ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన హార్టికల్చర్ అధికారులు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్, భూగర్భజల అధికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ల పరీక్షలను యధావిధిగా నిర్వహించాలా? ఆ లోగా కొత్త ప్రశ్నపత్రాలు సిద్ధం అవుతాయా? తదితర విషయాలను పరిశీలిస్తోంది. అవసరమైతే వారం నుంచి 15 రోజుల వ్యవధితో వీటిని రీషెడ్యూలు చేసే అవకాశం ఉంది. అయితే వీటన్నింటినీ సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించాలని కమిషన్ యోచిస్తోంది.
➥ ఏఈఈ పోస్టులకు 81 వేల మంది, ఏఈ పోస్టులకు 74 వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పోస్టుల్లో వివిధ కేటగిరీలు ఉన్నందున, ఆయా విభాగాల వారీగా సీబీఆర్‌టీ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. తద్వారా పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో వేగం పెంచనుంది. గ్రూప్ సర్వీసుల ఉద్యోగాలకు సీబీఆర్‌టీ పద్ధతిలోనే విడతల వారీగా పరీక్షలు నిర్వహించి నార్మలైజేషన్ విధానంలో మార్కులను లెక్కించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ అంశంపై అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
'డేటా' సెక్యూరిటీపై మరింత నిఘా..
టీఎస్‌పీఎస్సీలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కమిషన్ భావిస్తోంది. ముఖ్యంగా డేటా సెక్యూరిటీపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఉన్నదానికంటే మరింత పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం సైబర్ సెక్యూరిటీ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. కంప్యూటర్లు, సర్వర్లు, ఫైర్‌వాల్ తదితర అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించే చర్యలపై దృష్టి పెట్టింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో మరింత పకడ్బందీగా సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. సైబర్ దాడులు, కంప్యూటర్ సేఫ్టీ, పాస్‌వర్డ్స్, యూజర్ ఐడీల భద్రత తదితర అంశాలపై సైబర్ సెక్యూరిటీ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు? ఉద్యోగులను కలవడానికి ఎవరైనా వస్తున్నారా? తదితర అంశాలపై దృష్టి సారించనుంది. కార్యాలయంలోని కంప్యూటర్లకు అసలు పెన్‌డ్రైవ్ యాక్సెస్ లేకుండా చేయడం, ప్రింటింగ్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రదేశాలకే పరిమితం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో సంస్థ ఉద్యోగులెవరూ తప్పుచేయకుండా, కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం లేకుండా పకడ్భందీ చర్యలు తీసుకుంటోంది.
సైబర్ భద్రతపై ఉద్యోగులకు శిక్షణ..
కార్యాలయ ఉద్యోగులకు సైబర్ భద్రతపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగులకు సైబర్ భద్రత, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై పరిజ్ఞానం పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కంప్యూటర్లు హ్యాక్ కాకుండా ఎలా వ్యవహరించాలి? కఠినమైన పాస్‌వర్డ్స్‌ను ఎలా పెట్టుకోవాలి? తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. దీనికోసం సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ను రంగంలోకి దింపారు. ప్రతిరోజు విధులకు ఆటంకం కలగకుండానే ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ విధానం అమలుకు యోచన..
టీఎస్‌పీఎస్సీలో సైబర్ సెక్యూరిటీ విధానాన్ని తీసుకొచ్చేందుకు కమిషన్ పరిశీలిస్తోంది. వారం రోజులుగా ఐఐటీ హైదరాబాద్, జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్సిటీల ఐటీ విభాగాధిపతులు, సైబర్ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమైంది. సీబీఆర్‌టీ విధానంలో పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్ వ్యవహారాలు, సైబర్ సెక్యూరిటీ, అలర్ట్ సిస్టమ్ తదితర అంశాలను పరిశీలించింది. చేయాల్సిన మార్పులు, భద్రత విషయాలపై సూచనలు తీసుకుంది.