➥పేపర్-1 పరీక్షకు 75.36 శాతం, 

➥పేపర్-2 పరీక్షకు 75.14 శాతం అభ్యర్థులు హాజరు 


తెలంగాణలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆదివారం (జనవరి 22) నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏడు జిల్లాల్లో 176 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. వివిధ విభాగాల్లోని 1540 ఖాళీలకు మొత్తం 81,548 మంది దరఖాస్తు చేసుకోగా 75,265 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీరిలో పేపర్‌-1, పేపర్‌-2కు రెండు సెషన్లలో జరిగిన పరీక్షకు ఉదయం సెషన్‌ పేపర్‌-1 పరీక్షకు 61,453 (75.36 శాతం) మంది, మధ్యాహ్నం పేపర్‌-2 పరీక్షకు 61,279 (75.14శాతం) మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 


మొబైల్‌ ఫోన్‌‌తో పరీక్షకు.. కేసు నమోదు 
ఏఈఈ పరీక్షకు ఓ అభ్యర్థి తన వెంట మొబైల్‌ ఫోన్‌ను తెచ్చుకున్నారు. వెంటనే గుర్తించిన సిబ్బంది అతనిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసును నమోదు చేశారు. హైదరాబాద్‌ మెహిదీపట్నంలోని నారాయణ జూనియర్‌ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం సెషన్‌కు ఓ అభ్యర్థి మొబైల్‌ ఫోన్‌తో పరీక్షా కేంద్రానికి హాజరైనట్లు అధికారులు గుర్తించి పోలీసు కేసును నమోదు చేయించినట్లు తెలిపారు.


రాతపరీక్ష ఇలా..: 
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర్-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి జనవరి 22న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏడు జిల్లాల్లోని 176 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. OMR విధానంలోనే పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌- 2 పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షకు ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. గేట్లు మూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించలేదు అధికారులు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగు  మాధ్యమాల్లో; పేపర్-2 ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఇచ్చారు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.


Also Read:


గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే? పోస్టుల పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 18న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కొన్ని పోస్టులకు పీజీ డిగ్రీ, డిప్లొమా అర్హత కూడా ఉండాలి. అభ్యర్థులు ఫీజుగా రూ.320 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.120 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
గ్రూప్-2 దరఖాస్తు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...