TET 2024 Detailed Notification: తెలంగాణలో 'టెట్' అభ్యర్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తు ఫీజులను భారీగా పెంచింది. టెట్‌కు సంబంధించి గతంలో ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా... దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గూబ గుయ్యిమనిపించింది.. గతంలో రూ.300 గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది. ఈ మేరకు టెట్‌కు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ను మార్చి 22న విడుదల చేసింది. ఇందులో టెట్ ఫీజుల వివరాలు, అర్హతలు, తదితర అంశాలను వెల్లడించింది.
తగ్గించకపోతే ఉద్యమం..
కాంగ్రెస్ అధికారంలో వస్తే పరీక్ష ఫీజులు ఉండవు అని చెప్పి, ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ఒక్కో పేపర్‌కు రూ.1000 వసూలు చేయటం దారుణమని రాష్ట్ర డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఇది 4 లక్షల మంది అభ్యర్థులను మోసం చేయడమేనని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు తగ్గించాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. టెట్ పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా కాకుండా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో మార్చి 15న టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్‌లైన్లను సైతం విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
అర్హతలివే..
➥ టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే.
➥ టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
పరీక్ష విధానం:
➥ టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు.
➥ పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు..
➥ టెట్-2024 నోటిఫికేషన్: 14.03.2024.
➥ టెట్-2024 ఇన్‌ఫర్మేషన్ బులిటెన్, సమగ్ర నోటిఫికేషన్: 22.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 27.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు. ఫీజు చెల్లింపునకు చివరితేది: 10.04.2024.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 15.05.2024 నుంచి.
➥ టెట్-2024 పరీక్ష తేదీలు: 20.05.2024 - 03.06.2024.
➥ పరీక్ష సమయం: ఉదయం 9 గం. - 11.30 గం. వరకు, మధ్యాహ్నం 2 గం.- సాయంత్రం 4.30 వరకు.
➥ టెట్-2024 ఫలితాల వెల్లడి: 12.06.2024.
TS TET 2024 Detailed Notification
TS TET 2024 Information Bulletin
''డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని సుమారు మూడు లక్షల మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు ప్రయోజనం కలుగనుంది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఎస్సీ రాతపరీక్షలను జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్ నిర్వహణ తప్పనిసరి కావడంతో డీఎస్సీ దరఖాస్తు గడువును విద్యాశాఖ జూన్ 20 వరకు పొడిగించింది. డీఎస్సీకి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.''
తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..