TREI-RB Recruitment Process: తెలంగాణలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ప్రభుత్వ గురుకులాల్లోని ఖాళీల భర్తీ ప్రక్రియ తిరిగి ప్రారంభంకానుంది. నియామకాలను పూర్తి చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TREI-RB) కసరత్తు మొదలుపెట్టింది. ఆగస్టులోనే రాతపరీక్షలు పూర్తికావడంతో.. మెరిట్ జాబితాను సైతం బోర్డు సిద్ధం చేసింది. ఎంపిక ప్రక్రియ చేపట్టే క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్టుల భర్తీపై బోర్డు దృష్టిసారించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల వారీగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు సిద్ధం చేసింది.
అభ్యర్థులను డెమోకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్న దశలో హారిజంటల్, వర్టికల్ రిజర్వేషన్ విధానం, గురుకుల ఉద్యోగుల ప్రమోషన్లు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్టులకు సంబంధించి కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో కోర్టు ఆదేశాల కోసం ట్రిబ్ ఎదురుచూస్తోంది. వారంలో ఆయా అంశాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసులు పరిష్కారమైన వెంటనే నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, డెమో నిర్వహణ ఏర్పాట్లపై బోర్డు దృష్టి సారించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలపై సంబంధిత సిబ్బందికి గురువారం (డిసెంబరు 28) ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
క్ర.సం. | పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
1. | డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ | 868 |
2. | జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ | 2008 |
3. | పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) | 1276 |
4. | ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) | 4020 |
5. | లైబ్రేరియన్ స్కూల్ | 434 |
6. | ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ | 275 |
7. | డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ | 134 |
8. | క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్ | 92 |
9. | మ్యూజిక్ టీచర్స్ | 124 |
మొత్తం ఖాళీలు | 9210 |