TS Gurukula Posts Results: తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టుల నుంచి స్పష్టత రాగానే.. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాలను ప్రకటించనుంది. ఆ తర్వాత వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక జాబితాను వెల్లడించనుంది. ఫలితాల వెల్లడి నుంచి నియామక పత్రాల అందజేత వరకు దాదాపు మూడు నెలలకు పైగా సమయం పట్టవచ్చు. ఈ విద్యాసంవత్సరంలోగా నియామకాలు పూర్తిచేసి, పోస్టింగులు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళలకు సమాంతర రిజర్వేషన్లు..
గురుకుల పోస్టులకు సంబంధించి ఖాళీల నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సైతం సూచించింది. అయితే ఈ అంశంపై కొంత స్పష్టతతో పాటు ఫలితాల వెల్లడికి అనుమతించాలని బోర్డు హైకోర్టును ఆశ్రయించింది.
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్..!
గురుకుల పోస్టుల నియామకాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు నుంచి స్పష్టత రాగానే మొదట డిగ్రీ లెక్చరర్లు (DL), తర్వాత జూనియర్ లెక్చరర్లు (JL), పీజీటీ(PGT) పోస్టుల ఫలితాలను వెల్లడించనున్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి 1:2 నిష్పత్తిలో ప్రాథమిక జాబితాను గురకుల బోర్డు ప్రకటించనుంది. ఇక అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారు. అభ్యర్థులు తమకు అనుకూలమైన రోజు, కోరుకున్న సమయాన్ని బుక్ చేసుకుని ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విద్యాసంస్థల్లో ప్రవేశాల సందర్భంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 20 నుంచి 30 రోజుల సమయం పట్టే అవకాశముందని సమాచారం. ఎంపికైన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించి 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభానికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 1 నుంచి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడుషిప్టుల చొప్పున రాతపరీక్షల్ని గురుకుల నియామకబోర్డు నిర్వహించింది. వీటికి సగటున 75.68 శాతం మంది హాజరయ్యారు. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల వారీగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు సిద్ధం చేసింది.