TGPSC Notification | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSSC) ఉద్యోగ నియామక ప్రక్రియలో వేగాన్ని, పారదర్శకతను పెంచాలని చూస్తోంది. ఈ మేరకు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకున్న దాదాపు 31.56 లక్షల మంది అభ్యర్థులు తమ వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ ఆదేశించింది.

Continues below advertisement

గతంలో అభ్యర్థులు కేవలం వివరాలు నమోదు చేస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు ప్రతి విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి అని కీలక సంస్కరణను తీసుకొచ్చినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీలోపు టీజీపీఎస్సీ అభ్యర్థులందరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 

నియామక ప్రక్రియలో జాప్యానికి చెక్

ఈ నూతన విధానం వల్ల ఫలితాల వెల్లడి తర్వాత జరిగే ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) ప్రక్రియ అత్యంత సులభతరం కానుంది. అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన పత్రాలను కమిషన్ ముందస్తుగానే సంబంధిత విశ్వవిద్యాలయాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో వెరిఫై చేస్తుంది. దీనివల్ల నియామక పత్రాల అందజేతలో నెలల తరబడి జరిగే విధానంలో జాప్యం తగ్గుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణతో, అభ్యర్థులు తమ ఉపకులాల వివరాలను కూడా ఓటీఆర్‌లో సవరించుకోవాల్సి ఉంటుంది. తాజా కలర్ ఫొటో, కొత్త విద్యార్హతలు, ఈడబ్ల్యూఎస్ (EWS), నాన్-క్రీమీలేయర్ వంటి కేటగిరీలను మాత్రమే అప్‌డేట్ చేసేందుకు అవకాశం కల్పించారు.

Continues below advertisement

త్వరలో నోటిఫికేషన్.. 500కు పైగా ఇంజినీరింగ్ పోస్టులు

ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. పెండింగ్‌లో ఉన్న పాత నియామకాలను పూర్తి చేసిన కమిషన్, కొత్త నోటిఫికేషన్లపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి నోటిఫికేషన్ వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఇంజినీరింగ్ సర్వీసుల భర్తీకి విడుదల కానుంది. సుమారు 500కు పైగా ఇంజినీరింగ్ పోస్టులతో ఈ ప్రకటన వస్తుందని సమాచారం. ఓటీఆర్ అప్‌డేట్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషన్ భావిస్తోంది. భవిష్యత్తులో వచ్చే అన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయాలంటే ఇప్పుడు ఓటీఆర్ అప్‌డేట్ చేయడం ముఖ్యమని అభ్యర్థులకు సూచించింది.