AP TET Results: ఏపీలో టెట్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఎన్నికల కమిషన్‌ అనుమతి తర్వాతే ఫలితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 14న టెట్ ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే నిర్ణీత తేదీలో ఫలితాల వెల్లడి సాధ్యంకాలేదు. ఈలోపు ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చింది. దీంతో టెట్ ఫలితాల వ్యవహారం ఈసీకి చేరినట్టయింది. ఎన్నికల్ సంఘం నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.


ఏపీటెట్ ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


ఏపీటెట్ - 2024 వెబ్‌సైట్


డీఎస్సీ-2024 పరీక్షలు ఎన్నికల తర్వాత..
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఏపీ డీఎస్సీ-2024 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్‌స‌భ‌ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. డీఎస్సీ పరీక్షలను ఎన్నికల తర్వాతే నిర్వహించే అవకాశాలున్నాయి. డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయని, డీఎస్సీ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నామని, ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుందని సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా అన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. 


ఏపీలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును కూడా విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీనిప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. అయితే చాలా మంది అభ్యర్థులు డీఎస్సీ ప‌రీక్షలు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను అభ్యర్థించారు. అయితే ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఇది తమ ప‌రిధిలో ఉండ‌ద‌ని.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అనుమతిస్తే వాయిదా వేస్తామ‌ని అభ్యర్థులకు తెలిపింది. అయితే.. ఏపీ విద్యాశాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతలేదు.


 ALSO READ:


సీటెట్‌ (జులై) - 2024 నోటిఫికేషన్‌ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్)- జులై 2024 నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) మార్చి 7న విడుదల చేసింది. అదేసమయంలో సీటెట్ దరఖాస్తు ప్రక్రియను మార్చి 7న ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది రెండుసార్లు (జులై, డిసెంబరు) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది.
సీటెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..