TGPSC FBO Notification 2026:తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో భారీ తీపి కబురు అందించడానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ సంపదను కాపాడటంతోపాటు, పర్యావరణ సమతుల్యతను పర్యవేక్షించేందుకు అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెడీ అయ్యింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ భారీ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. పోలీస్ ఉద్యోగాల తరహాలోనే యూనిఫామ్ సర్వీస్‌పై మక్కువ చూపే అభ్యర్థులకు, ముఖ్యంగా కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
తెలంగాణ ప్రభుత్వ అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా చాలా పనులు చేపడుతోంది. అయితే అడవుల సంరక్షణలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించే బీట్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉంది. అటవీ ఆక్రమణలు, కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల రక్షణ కోసం అటవీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సుదీర్ఘ క కాలం తర్వాత ఏక కాలంలో 1393 పోస్టుల భర్తీతో యువతకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అర్హతలు- వయోపరిమితి
డిగ్రీ లేదా ఉన్నత విద్యతో సంబంధం లేకుండా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా అభ్యర్థులకు కనీస వయసు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయసు 31 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాల వారికి గరిష్ట వయోపరిమితి ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అంటే వాళ్లు 36 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మాజీ సైనిక ఉద్యోగులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ- పరీక్ష విధానం
టీజీపీఎస్‌సీ ఈ రిక్రూట్‌మెంట్‌లను మూడు దశల్లో పూర్తి చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రాథమిక పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 100 ప్రశ్నలు , 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. పేపర్-1 కరెంట్ అఫైర్స్, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భారత్ రాజ్యాంగం, పర్యావరణ అంశంపై ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్ పదో తరగతి స్థాయిలో ఉంటుంది. అర్థమేటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
శారీరక ప్రమాణాలు- వాకింగ్ టెస్టు
రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్టు ఉంటుంది. ఇందులో పురుషులు కనీసం 163 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉంటే సరిపోతుంది. వాకింగ్ ఎండ్యూరెన్స్ టెస్టు ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో పురుషులు 4 గంటల్లో 25 కిలోమీటర్లు, మహిళలు 4 గంటల్లో 16 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు?
నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినందున టీజీపీఎస్సీ ఏ క్షణమైనా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయిన వారికి నెలకు 35వేల నుంచి 42వేల రూపాయల జీతం ఇస్తారు. ఇవి కాకుండా ప్రభుత్వ అలవెన్సులు, యూనిఫామ్ సర్వీస్ ఇస్తారు. నిరుద్యోగులు కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాకుండా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
