TSPSC Group1 Reservations: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలన్న టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెం. 33) జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోకి అనుగుణంగా గ్రూప్‌-1 పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరి 19న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 


ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ నిర్ణయం వల్ల మొత్తం రిజర్వేషన్లు 54 శాతానికి పెరిగాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించడం అనేది రాజ్యాంగంలోని 14, 15, 16 అధికరణలకు విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన కోర్టుకు గుర్తుచేశారు. రిజర్వేషన్ల పెంపునకు సామాజిక అధ్యయనం నిర్వహించాలని, అలాంటిదేమీ లేకుండానే ఎస్టీ రిజర్వేషన్లను పెంచడం, గ్రూప్‌-1 పోస్టుల్లో ఎస్టీలకు 10% రిజర్వు చేయడం చెల్లదని వాదించారు. 


పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న జస్టిస్‌ అభినందకుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం.. గ్రూప్-1 నియామకాలు తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను జూన్‌ 28కి వాయిదా వేసింది. జీవో 33పై సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.


OMR విధానంలోనే ప్రిలిమ్స్ పరీక్ష..
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇటీవల వెల్లడించింది. ప్రిలిమ్స్ పరీక్షను ఓఎంఆర్(OMR) విధానంలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను, అక్టోబర్ 21న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీస్సీ ఇప్పటికే వెల్లడించింది. పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష సమయానికి 4 గంటల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 


తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 563 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 2 సంవత్సరాలకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో గరిష్ఠవయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు చేరింది. అయితే నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తించనున్నాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీ్స్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. 


గ్రూప్-1 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...