తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయనున్న 9 వైద్య కళాశాలలకు మరో 313 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. క్లినికల్, నాన్-క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతించింది. ఈమేరకు ఆర్థికశాఖ ఫిబ్రవరి 4న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ కళాశాలలకు 3,897 పోస్టులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో మెడికల్ కాలేజీ, అనుబంధ హాస్పిటల్‌కు వివిధ కేటగిరీల్లో కలిపి 433 పోస్టులను సృష్టించింది.
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ త్వరలోనే రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ మరియు షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ 9 మెడికల్ కాలేజీలు మరియు వాటి అనుబంధ ఆసుపత్రులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో ఒక్కో కాలేజీకి 433 పోస్టుల చొప్పున మొత్తం 3897 కొత్త పోస్టులను ప్రభుత్వం గతంలోనే మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటివరకు 49,428 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. తాజాగా మరో 313 పోస్టులకు ఆమోదముద్ర వేసింది.
విభాగాలివే..
పాథాలజీ, అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్, ఫోరెన్సిక్, మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇటీవల సీఎం కేసీఆర్ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాతి దశలో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసి, బడ్జెట్‌లో నిధులనూ కేటాయించింది. తాజాగా ఆయా కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబరు 15న ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చవల్‌గా ఒకేసారి 8 మెడికల్ కాలేజీలలో విద్యా బోధన తరగతులను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ ప్రారంభం తరువాత ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఒక్క విద్యా సంవత్సరం (2022-23)లోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమైనవి. వీటికి ఆయా జిల్లాల ఆసుపత్రులను అనుసంధానం చేశారు. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో 1,200 మెడికల్ సీట్లను కేటాయించారు. వీటితోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 85 శాతం బీ కేటగిరీ మెడికల్ సీట్లను సైతం విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అదనంగా 1,068 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి.
జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్‌లో మెడికల్ కాలేజీలను నిర్మించిన సంగతి తెలిసిందే. వీటిని సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే త్వరలో కొత్తగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.
ఈ ఎనిమిది మెడికల్ కాలేజీల ప్రారంభంతో ఈ విద్యా సంవత్సరంలో 1150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. 2022 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో ఆ సంఖ్య 2091కి చేరింది. 2014లో 613 పీజీ సీట్లు ఉండగా 2022 నాటికి మొత్తం పీజీ గవర్నమెంట్ మెడికల్ సీట్ల సంఖ్య 1,249కి చేరింది. దీంతో రాష్ట్ర మెడికల్ విద్యార్ధులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
Also Read:
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్'తో పరీక్షలకు అనుమతి!
తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు కీలక అలర్ట్.. ఇంటర్మీడియట్‌లో 60% అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న విద్యార్థులను పరీక్షకు అనుమతించేందుకు ఇంటర్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. బోర్డు నిబంధనల ప్రకారం 75% హాజరు తప్పనిసరి. సరైన కారణాలతో ఏ విద్యార్థికైనా 60% - 75% వరకు హాజరు ఉంటే ప్రతిపాదనలు పంపాలని సంబంధిత ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు సూచించింది. విద్యార్థులు 10 రోజుల తక్కువ హాజరుకు రూ.1000, అదేవిధంగా 15 రోజుల వరకు రూ.1500, 15 రోజులు మించితే రూ.2 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
అటెండెన్స్ పూర్తి వివరాలు, పరీక్ష షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..