Telangana DSC 2024: తెలంగాణలో 11 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న ప్రభుత్వం 'మెగా డీఎస్సీ-2024' నోటిపికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా.. జూన్ నాటికి నియామకాలు పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం మాత్రం నెరవేరేలా కనిపించడంలేదు. డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే వారిలో చాలా మంది గ్రూప్-1 పరీక్షలకు హాజరవుతుండటమే ఇందుకు కారణం. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటించింది. దీంతో గ్రూప్-1 పరీక్ష జరిగేవరకు డీఎస్సీ నిర్వహణ సాధ్యంకాదు. దీంతో జూన్ నెలాఖరులో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. 


10 రోజులపాటు పరీక్షలు..
డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్‌బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో కనీసం 10 రోజులపాటు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.


పోస్టులు దాదాపు రెట్టింపు..
ఈసారి 1,016 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను పక్కనబెట్టినా.. ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 10,046కు చేరింది. అంటే పాత నోటిఫికేషన్(5,089)తో పోల్చుకుంటే పోస్టులు దాదాపు రెట్టింపు అయినట్లే. పోయినసారి స్కూల్ అసిస్టెంట్లలో పలు సబ్జెక్టులకు.. పలు జిల్లాల్లో పోస్టులు లేకపోవడం.. ఉన్నా 10లోపే ఉండటంతో పలువురు అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి వెనకడుగు వేశారు. ఈసారి కొత్తగా కనీసం లక్ష మంది పెరుగుతారని విద్యాశాఖ అంచనా. గతంలో వర్టికల్ రోస్టర్ పాయింట్ విధానం ఉండగా.. ఈసారి సమాంతర రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నారు. దానివల్ల జనరల్ విభాగంలో ఖాళీలు పెరగనున్నాయని, ఫలితంగా పోటీపడే వారి సంఖ్య అధికంగా ఉండనుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.


టెట్ నిర్వహణకు అభ్యర్థనలు..
డీఎస్సీ పరీక్షల కంటే ముందుగానే 'టెట్' పరీక్ష నిర్వహించాలని పలువురు అభ్యర్థులు విన్నవిస్తున్నారు. తర్వాతే డీఎస్సీ పరీక్షలు జరపాలని కోరుతున్నారు. ఐదున్నర నెలల క్రితం టెట్ నిర్వహించారని.. ఆ పరీక్షలో కూడా 84 శాతం మంది తప్పారని, మళ్లీ నిర్వహిస్తే అనేక వేల మందికి డీఎస్సీ అవకాశం లభిస్తుందని అంటున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ప్రతి ఆరు నెలలకు ఒకసారి సెంట్రల్ టెట్ జరుపుతోంది. 


మార్చి 4 నుంచి దరఖాస్తులు..
టీఎస్ డీఎస్సీ-2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచిన నేపథ్యంలో 46 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్షల తేదీలను ప్రభుత్వం ఇంకా వెళ్లడించలేదు. త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.


సమస్య తలెత్తకుండా అధికారుల జాగ్రత్తలు.. 
డీఎస్సీ నిర్వహణకు సంబంధించి.. ప్రశ్నపత్రాలు మొదలుకొని ఫలితాల వరకూ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టారు. పాస్‌వర్డ్స్, ఆన్‌లైన్‌ వ్యవస్థ భద్రతాంశాలను ఉన్నతాధికారులు సమీక్షించారు. సాంకేతిక విభాగంలో ప్రైవేటు సంస్థల పాత్ర ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించారు. కీలకపాత్ర పోషించే అధికారులు ప్రతి అంశాన్నీ పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..