తెలంగాణలో ఎన్నికల కారణంగా నవంబరు 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. త్వరలోనే వాయిదా పడిన పరీక్షల తేదీలను వెల్లడించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన అక్టోబరు 13న ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఫిబ్రవరి దాకా పరీక్షల నిర్వహణ అసాధ్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్‌టీ ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యత టీసీఎస్ అయాన్ చేపట్టింది. టీసీఎస్ సంస్థ జాతీయ స్థాయి ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. డిసెంబరు, జనవరిలో పలు జాతీయస్థాయి పరీక్షలు ఉన్నాయని ముందుగానే ఆ సంస్థ ప్రతినిధులు విద్యాశాఖకు స్పష్టం చేశారు. మళ్లీ ఫిబ్రవరిలోనే స్లాట్లు దొరుకుతాయని సెప్టెంబరులోనే ఆ సంస్థ స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఇక జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అందువల్ల ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒకవేళ జేఈఈ మెయిన్ కంటే ముందుగా స్లాట్లు దొరికితే జనవరి రెండో వారం నుంచి జనవరి 24వ తేదీ లోపు జరపాలన్న యోచనలో కూడా విద్యాశాఖ ఉన్నట్లు తెలిసింది. విద్యాశాఖ మాత్రం పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఫిబ్రవరిలో నిర్వహిస్తే.. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తికాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబరులోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. కానీ, ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడటంతో మళ్లీ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం..
ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు అక్టోబర్ 21తో ముగియనుంది. ఇప్పటివరకు సుమారు 80 వేల దరఖాస్తులు అందాయి. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో ఆ గడువును కూడా పొడిగించే అవకాశం ఉంది. ఈసారి 2 - 2.5 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ-2023 పరీక్షల కోసం పోటీపడతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీలకు నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే నవంబరు 30న పోలింగ్ ఉండటంతో ఆన్‌లైన్ పరీక్షలైనందున సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ) పరీక్షల్లో రెండు రోజులపాటు లేదా నవంబరు 25 నుంచి 30 వరకు జరిగే ఎస్‌జీటీ పరీక్షల వరకు వాయిదా వేస్తారని విద్యాశాఖ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. తాజాగా కొందరు అభ్యర్థులు టీఆర్‌టీ మొత్తాన్ని వాయిదా వేయాలని, టీఎస్‌పీఎస్‌సీ సైతం గ్రూపు-2ను వాయిదా వేసిందని విన్నవించినా ఇవి ఆన్‌లైన్ పరీక్షలు అయినందున పూర్తిగా వాయిదా వేసేది లేదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వారికి తేల్చిచెప్పారు. తాజాగా టీఆర్‌టీ మొత్తాన్ని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
ALSO READ:
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగ నియామక పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసినట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎస్ పీఎస్పీ గ్రూప్ 2 వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ఇదివరకే ప్రకటించింది. గతంలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అభ్యర్థు కోరిక, భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నవంబర్ కు వాయిదా వేయడం తెలిసిందే.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..