Supreme Court: తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు సంబంధించిన అడ్డంకి తొలగిపోయింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్‌ను ఈ మేరకు సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. 

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా పిటిషన్ కొట్టివేతతో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లైంది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.

తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు సంబంధించిన జనరల్ ర్యాంకు జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 30న విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్‌లో ఏడు పేపర్లకు హాజరైన అభ్యర్థుల ప్రాథమిక మార్కుల జాబితాను మార్చి 10న వారి వ్యక్తిగత లాగిన్‌లలో టీజీపీఎస్సీ పొందుపర్చి, అభ్యర్థుల నుంచి మార్చి 24 వరకు రీకౌంటింగ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. పునఃలెక్కింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. పరీక్షకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను తాజాగా ప్రకటించింది. అర్హత పరీక్ష ఇంగ్లిష్‌తో పాటు ప్రధాన పరీక్షలైన ఆరు పేపర్ల మార్కులను వెల్లడించింది. 

జీఆర్‌ఎల్‌లో మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తామని కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్ పరీక్షలను గతేడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించారు. ఈ ఫలితాల్లో మహిళలు సత్తాచాటారు. తొలి వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉండటం విశేషం. అందులోనూ టాప్-10లో ఆరుగురు, టాప్-50లో 25 మంది మహిళలు ఉన్నారు. ప్రధాన పరీక్షల్లో (అర్హత పరీక్ష ఇంగ్లిష్ మినహా) 500కి పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 52 మంది ఉన్నారు. టాప్-3 ర్యాంకరుతో పాటు టాప్-100లో ఐదుగురు తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ చాటారు.

గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధికంగా ఉన్నారు. పరీక్షకు హాజరైన 20,161 మందిలో 12,323 మంది ఆంగ్ల మాధ్యమం.. 7,829 మంది తెలుగు.. 9 మంది ఉర్దూ మాధ్యమ అభ్యర్థులు ఉన్నారు. గ్రూప్-1లో సమాన మార్కులు వచ్చిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే కేవలం 0.5 మార్కుల తేడాతో పలువురు జీఆర్‌ఎల్‌లో కొన్ని ర్యాంకులు వెనుకబడ్డారు. 

అభ్యర్థుల వ్యక్తిగత మార్కుల మెమోను వెబ్‌సైట్ వ్యక్తిగత లాగిన్‌లలో పొందుపరిచామని, హాల్‌టికెట్, టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, ఓటీపీ నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. మార్కుల మెమోలు ఏప్రిల్ 5 వరకు వారం రోజుల పాటు, జనరల్ ర్యాంకు జాబితా ఏప్రిల్ 28 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని కమిషన్ తెలిపింది. హైకోర్టు ఆదేశాలకు లోబడి ప్రధాన పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలను న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రకటించలేదని పేర్కొంది.