YS Sharmila On AP Group 1 Mains | అమరావతి: గ్రూప్ 2 ఉద్యోగాల తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 విధానాన్ని అనుసరించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రూప్ అభ్యర్థుల తరఫున మరోసారి విన్నపం అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.


గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికపై షర్మిల పోస్ట్


‘ముఖ్యమంత్రి చంద్రబాబుగారు.. రాష్ట్రంలోని గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రూప్ 2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని , గ్రూప్ 1 మెయిన్స్ కి సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. జీవో నెంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీ (APPSC)కి ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉంది. 89 పోస్టులకు మీరు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4450 మంది మెయిన్స్ కి అర్హత పొందారు. 1:100 రేషియో లెక్కన పిలిస్తే మరో 4450 మందికి అవకాశం దక్కుతుందని అభ్యర్థులు ఆశ పడుతున్నారు.


రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే పరీక్షలు నిర్వహించడం లాంటి కారణాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాలు మళ్ళీ పోతే ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నీ కలిసి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి, న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ షర్మిల పోస్ట్ చేశారు.



Also Read: Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత


తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో ఇటీవల వివాదం నెలకొంది. టీజీపీఎస్సీ పాటిస్తున్న రిజర్వేషన్ విధానం వల్ల నష్టపోతామని కొందరు అభ్యర్థులు ఆరోపించారు. మరికొందరేమో రాష్ట్రంలో రిజర్వేషన్లు లేకుండా మెయిన్స్ కు ఎంపికైన అందరూ జనరల్ కిందకి వస్తారని చెప్పారు. అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అభ్యర్థులు చేసే ఆందోళనకు బీజేపీ సైతం మద్దతు తెలిపింది. ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల తరఫున అశోక్ నగర్ వెళ్లి రోడ్డుపై బైటాయించారు. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఛలో సెక్రటేరియట్ కు సైతం పిలుపునివ్వగా, భారీ సంఖ్యలో నిరుద్యోగులు సెక్రటేరియట్ వైపు వడివడిగా అడుగులు వేశారు. సెక్రటేరియల్ కు కాలి నడకన బయలుదేరిన వెంటనే బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా ఆయన పోలీసుల వాహనం దిగి మరికొంత దూరం నడిచారు. చివరికి ఆయనను పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకుని తమ వాహనంలో అక్కడి నుంచి తరలించారు.




Also Read: Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?