Rajasthan High Court cancels 2021 police recruitment exam:  రాజస్థాన్ హైకోర్టు 2021 పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. పేపర్ లీక్ ఆరోపణలు ,  రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల ప్రమేయం కారణంగా ఈ పరీక్ష వివాదాస్పద అంశంగా మారింది. హైకోర్టులో కేసులు పడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అక్రమాలు, మోసాలు స్పష్టంగా కనిపించాయని రాజస్తాన్ హైకోర్టు నియామకాలను రద్దు చేసేసింది.

2021లో ఆర్‌పీఎస్‌సీ 859 సబ్-ఇన్‌స్పెక్టర్, ప్లాటూన్ కమాండర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అ పరీక్ష ప్రక్రియలో పేపర్ లీక్ ఆరోపణలు తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్  కి విచారణ కోసం అప్పగించింది. విచారణలో 50 మందికి పైగా ట్రైనీ సబ్-ఇన్‌స్పెక్టర్లు , ఇతరులు అరెస్టయ్యారు. ఆర్‌పీఎస్‌సీ సభ్యులైన బాబూలాల్ కటారా,  రాము రైకా ప్రమేయం కూడా బయటపడింది.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొత్తం "కలుషితమైంది" అని హైకోర్టు తేల్చేసింది.  దీనిని రద్దు చేయకపోతే రాష్ట్రంలో చట్టం , శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం పడవచ్చని  తెలిపింది.   రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పనితీరుపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది . సుమోటోగా విచారణ చేయాలని కూడా నిర్ణయించింది.  అక్రమాలు మరియు మోసాలు స్పష్టంగా కనిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. ఈ తీర్పు యువత భవిష్యత్తుతో ఆడుకునే గ్యాంగ్‌లకు హెచ్చరికగా ఉంటుందని నిరుద్యోగులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.  బీజేపీ నేతృత్వంలోని  ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి డాక్టర్ కిరోడీ లాల్ మీనా ఈ తీర్పును స్వాగతించారు.  ఈ రిక్రూట్‌మెంట్‌లో భారీ మోసం జరిగింది. 500 మందికి పైగా అభ్యర్థులు మోసపూరిత మార్గాల ద్వారా ఉత్తీర్ణులయ్యారు. అలాంటి వారు సర్వీసులోకి వస్తే రాష్ట్రంలో చట్టం శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉండేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ పరీక్షను నిర్వహించారు.  2021లో రాష్ట్ర క్యాబినెట్ సబ్-కమిటీ తన నివేదికలో పరీక్షను రద్దు చేయవద్దని సిఫారసు చేసింది.  

రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై చట్టపరమైన సలహా తీసుకుని భవిష్యత్ చర్యలను నిర్ణయించనుంది.  ఈ తీర్పు రాజస్థాన్‌లో పరీక్షలలో  జరుగుతున్న అక్రమాలను బయట పెట్టినట్లయింది.  యువత భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీక్ గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని అక్కడని నిరుద్యోగులు అంటన్నారు.