రాష్ట్రంలో తాజాగా నియమితులైన 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పోస్టింగులు ఇవ్వడానికి తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 27 నుంచి 29 వరకు జోన్ల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మల్టీజోన్-1లోని అభ్యర్థులకు డిసెంబరు 27, 28 తేదీల్లో; మల్టీజోన్-2 పరిధిలోని వారికి డిసెంబరు 29న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. అభ్యర్థులు తాము ఏయే ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని శ్రీనివాసరావు సూచించారు. ఎంపికైనప్పటికీ కౌన్సిలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులకు సుమోటగా నియామక ప్రాంతాలను ఎంపిక చేసి ఉత్తర్వులను ఇంటికే పంపించనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734, వైద్య విధానపరిషత్‌లో 209, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 7 పోస్టులున్నాయి. వీరికి విభాగాల వారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పోస్టులకు రోజుకు 250 మంది చొప్పున 3 రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఒక రోజులో కౌన్సెలింగ్ పూర్తి చేస్తారు. పోస్టుల ఖాళీల సమాచారాన్ని ముందస్తుగానే అభ్యర్థులకు వెల్లడించి, అందుబాటులో ఉన్న ఖాళీల్లో పోస్టింగ్ ఇస్తారు.
మొత్తం 4,800 దరఖాస్తులు రాగా వాటిలో రెండో విడతలో 1,860 మంది అర్హులను ఎంపిక చేశారు. వీరిలో దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది అర్హులను గుర్తించారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను డిసెంబరు 19న వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ విడుదల చేసింది.
4,661 నర్సు పోస్టుల భర్తీకి అతిత్వరలో నోటిఫికేషన్..
తెలంగాణలో అతిత్వరలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది. వైద్యా్రోగ్యశాఖ పరిధిలో 4,661 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రకటనల విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఖాళీల భర్తీకి అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్ధులు సన్నద్ధమవడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఇచ్చే అవకాశం ఉంది. పరీక్షలో వచ్చిన మార్కులు, వెయిటేజీ మార్కులను జోడించి, తుది అర్హులను ఎంపిక చేయనున్నారు.
వైద్యుల నియామకాల్లో అర్హత పరీక్ష నిర్వహించలేదు. వారి అర్హత మార్కులను, వెయిటేజీని ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే నర్సుల పోస్టుల భర్తీకి మాత్రం అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. ఈనెలాఖరులోగా నియామక ప్రకటన వెలువరించి, పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధమవడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఇస్తారు. బహుళ ఐచ్ఛిక సమాధానాల రూపంలో ప్రశ్నపత్రం రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమిస్తారు.
పరీక్ష నిర్వహణ, మూల్యాంకన బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వీరు ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థకు అందజేస్తారు. ఆ ఫలితాలకు వెయిటేజీ మార్కులను జోడించి, తుది అర్హుల జాబితాను ఆ సంస్థ ప్రకటిస్తుంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి ఎలాంటి నిబంధనలు అనుసరిస్తుందో.. అదే విధానాన్ని స్టాఫ్‌నర్సుల నియామకాల్లోనూ అనుసరించాలని వైద్యశాఖ తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థను ఆదేశించింది.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం పోస్టుల్లో అధికంగా అనస్థీషియా విభాగంలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 5న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..