Why the IT giant suddenly fired 30000 employees:  ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగాల కోత విధించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత ఐటీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది. సుమారు 30,000 మంది ఉద్యోగులను రాత్రికి రాత్రి తొలగిస్తున్నట్లుగా మెయిల్స్ పంపింది.  క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , అప్లికేషన్ల విభాగాల్లో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రభావం భారత్‌లోని హైదరాబాద్, బెంగళూరు కార్యాలయాలపై తీవ్రంగా పడటంతో ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒరాకిల్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణం  AI రేస్ లో నిలదొక్కుకోవడం. ఓపెన్ ఏఐ వంటి సంస్థలతో కుదుర్చుకున్న బిలియన్ డాలర్ల ఒప్పందాల కోసం భారీ స్థాయిలో ఏఐ డేటా సెంటర్లను నిర్మించాల్సి ఉంది. దీనికోసం కంపెనీకి తక్షణమే భారీ నగదు అవసరం. ఈ లేఆఫ్స్ ద్వారా ఏటా సుమారు 8 బిలియన్ల నుండి 10 బిలియన్ డాలర్ల  వరకు ఖర్చును తగ్గించుకుని, ఆ మొత్తాన్ని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ,  ఎన్విడియా  చిప్స్ కొనుగోలుకు మళ్లించాలని సంస్థ భావిస్తోంది. అంటే, మనుషుల కంటే మెషీన్లే ముఖ్యం అనే సంకేతాన్ని కంపెనీ ఇస్తోంది.

Continues below advertisement

మరో కీలక కారణం ఒరాకిల్‌పై ఉన్న అపారమైన అప్పుల భారం . ప్రస్తుతం కంపెనీ సుమారు  108 బిలియన్ల  అప్పుల్లో ఉంది. గత కొన్ని నెలల్లోనే డేటా సెంటర్ల కోసం అదనంగా వేల కోట్ల డాలర్ల అప్పులు తీసుకురావడంతో, కంపెనీ క్రెడిట్ రేటింగ్ పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అమెరికన్ బ్యాంకులు కొత్తగా అప్పులు ఇవ్వడానికి వెనుకాడుతుండటంతో, అంతర్గతంగా ఖర్చులు తగ్గించుకోవడమే ఏకైక మార్గమని యాజమాన్యం భావించింది. ఈ క్రమంలోనే లాభాల్లో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఉద్యోగులపై వేటు వేసింది.

ఈ లేఆఫ్స్ లో ఎక్కువగా లెగసీ సాఫ్ట్‌వేర్ అంటే పాత టెక్నాలజీ  విభాగాల్లో పనిచేస్తున్న వారు బాధితులుగా ఉన్నారు. క్లౌడ్,   ఏఐ వైపు కంపెనీ పూర్తిగా మారుతున్న తరుణంలో, పాత డేటాబేస్ మేనేజ్‌మెంట్ ,  సపోర్ట్ విభాగాల్లో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు కంపెనీకి అదనపు భారం గా కనిపిస్తున్నారు. ఏఐ రాకతో చాలా పనులు ఆటోమేట్ అవుతాయని, కాబట్టి ఇంతమంది సిబ్బంది అవసరం లేదని కంపెనీ ఒక నిర్ధారణకు వచ్చింది. అందుకే ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా 18 శాతం మందిని తొలగించింది.

Continues below advertisement

ఒరాకిల్ అనుసరించిన ఈ  రాత్రికి రాత్రి మెయిల్ పద్ధతి సంస్థలోని నైతిక విలువలను ప్రశ్నిస్తోంది. సాధారణంగా ఏ కంపెనీ అయినా లేఆఫ్స్ చేసేటప్పుడు కొంత నోటీసు పీరియడ్ లేదా ముందస్తు సమాచారం ఇస్తుంది. కానీ, ఒరాకిల్ మాత్రం ఉదయం 6 గంటలకే మెయిల్స్ పంపి, వెంటనే సిస్టమ్ యాక్సెస్ కట్ చేసింది. ఇది కేవలం ఖర్చు తగ్గింపు మాత్రమే కాదు, ఇన్వెస్టర్లకు మేము చాలా కఠినంగా ఉన్నాం, లాభాల కోసం ఏదైనా చేస్తాం అని చూపించుకునే ఒక ప్రయత్నంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

 ఈ పరిణామం మొత్తం ఐటీ రంగానికి ఒక  టెంప్లేట్  గా మారే ప్రమాదం ఉంది. లాభాల్లో ఉన్న కంపెనీలు కూడా ఏఐ మౌలిక సదుపాయాల కోసం వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేయడం అనేది ఒక కొత్త ట్రెండ్‌కు దారితీయవచ్చు. భారత్ వంటి దేశాల్లోని ఐటీ నిపుణులు తమ నైపుణ్యాలను ఏఐకి అనుగుణంగా మార్చుకోకపోతే, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని  రాత్రిపూట మెయిల్స్  వచ్చే అవకాశం ఉందని  భావిస్తున్నారు. మొత్తానికి ఒరాకిల్ లేఆఫ్స్ వార్త కేవలం ఒక కంపెనీకి సంబంధించినది మాత్రమే కాకుండా, మొత్తం టెక్ ప్రపంచంలో ఒక అనిశ్చితిని సృష్టించింది. ఈ తొలగింపులు ఇక్కడితో ఆగుతాయా లేదా అన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న.